
ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించిన హరీశ్‌రావు
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే పాఠశాలల్లో వరుస గా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 80 మంది వరకు విద్యార్థులు ఆస్ప త్రిలో చేరారని చెప్పారు.
ఇటీవల కాలంలోనే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, హుజూరాబాద్ బీసీ గురుకులంలో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 20 నెలల సమయంలో రాష్ట్రంలోని గురుకు లాల్లో 100 మంది విద్యార్థులు చనిపోయారని, అయినా సీఎం రేవంత్ రాతి గుండె కరగడం లేదన్నా రు. విద్యాశాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయన సొంత జిల్లాలోనే రోజుకో సంఘటన జరుగుతుంటే ఏమనాలని ప్రశ్నించారు.
తాము పాఠశాలను సందర్శించేందుకు వస్తున్నామని తెలిసి, విద్యార్థుల ను చికిత్స మధ్యలోనే హడావుడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారన్నారు.గురుకులాల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని రెండు చేతులు జోడించి హరీశ్‌రావు అభ్యర్థించారు. పాఠశాలను సందర్శించిన వారిలో మాజీమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.