బచ్చాలతో భేటీలా?.. రాహుల్‌ గాంధీ సలహా విని ఆజాద్‌ మండిపడిన వేళ

Ghulam Nabi Azad Slams Congress Party Rahul Gandhi  - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత సీనియర్‌ పొలిటీషియన్‌ గులాం నబీ ఆజాద్‌ మాటల తుటాలు పేలుస్తున్నారు. రాజ్య సభ సీటు దక్కనందుకు, సౌత్‌ ఎవెన్యూలోని బంగ్లా ఆయన చేజారినందుకు ఫ్రస్టేషన్‌లోనే ప్రేలాపనలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, ఆజాద్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చింది. ఈ తరుణంలో.. 

ఇవాళ కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత తొలిసారిగా మీడియా ఎదుటకు వచ్చారు ఆజాద్‌. ‘‘కాంగ్రెస్‌లో ఇప్పుడున్న 90 శాతం మంది కాంగ్రెస్సీలు కారు. కొందరు కాలేజీల నుంచి వచ్చారు.. మరికొందరు సీఎంల దగ్గర అటెండర్‌ పనులు చేసుకునేవాళ్లు. వాళ్ల వాళ్ల చరిత్ర గురించే సరిగా తెలియనివాళ్లతో నేనేం వాదించాలి. విమర్శలకు ఏం సమాధానం ఇవ్వాలి.

జీ-23 గ్రూప్‌ అనేది ఏర్పడక ముందు.. ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియాగాంధీకి లేఖ రాశాను. అప్పుడేం చేశారు?.. కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడుకోమని నాకు చెప్పారు. నేను పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఉన్న టైంలో.. ఆయన(వేణుగోపాల్‌ను ‍ఉద్దేశిస్తూ..) స్కూల్‌కు వెళ్లే వాడు.. ఓ బచ్చా అని చెప్పా. అప్పుడు ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి రణ్‌దీప్‌ సూర్జేవాలాతో మాట్లాడమని సలహా ఇచ్చాడు. 

నేను జనరల్‌ సెక్రటరీగా ఉన్న టైంలో.. రణ్‌దీప్‌ తండ్రి పీసీసీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన నా కింద పని చేశారు. అలాంటి వ్యక్తి కొడుకుతో చర్చించాలా? ఏమయ్యా రాహుల్‌ గాంధీ.. ఏం మాట్లాడుతున్నావ్‌ అంటూ రాహుల్‌పై మండిపడ్డాను అని నాటి ఘటనను ఆజాద్‌ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో.. 

రాహుల్‌ గాంధీపై ఆజాద్‌ ఒకింత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడా? ఒకవేళ అతను కాకుంటే.. ఇంకెవరు కాంగ్రెస్‌ అధ్యక్షుడైనా సరే ఆ వ్యక్తి కచ్చితంగా రాహుల్‌ గాంధీకి బానిస కావాల్సిందే.. అతని ఫైల్స్‌ మోయాల్సిందే అంటూ ఆగ్రహం వెల్లగక్కారు ఆజాద్‌. 

ఈ వయసులోనూ పార్టీ కోసం రోజులో 20 గంటలపాటు పని చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందని ఆజాద్‌ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో.. సీనియర్ల మీద ఆరోపణలు గుప్పించాడు. తనకెవరూ మద్దతు ఇవ్వడం లేదంటూ పేర్కొన్నాడు.  ఏ విషయంలో మద్దతు ఇవ్వాలి?. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అనడంలోనా?.. ఓరోజు రాహుల్‌ నన్ను..  ‘బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు ఎందుకు చేయలేద’ని ప్రశ్నించాడు. దానికి నేను ‘‘అది నీ భాష. నాది కాదు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయిపైన ఏనాడూ ఇలాంటి ఆరోపణలు చేయాలని మాకు చెప్పలేదు. రాజీవ్‌ గాంధీ సైతం ప్రతిపక్షాల ఇళ్లకు వెళ్లమని చెప్పేవారు. అలాంటి సంస్కారం వాళ్లు నేర్పించారు. ఆ బాటలో ఉన్న మేం.. నువ్వు చెప్పే విమర్శలు చేయలేనని ఖుల్లాగా చెప్పాను’’ అని రాహుల్‌తో జరిగిన గత సంభాషణలను మీడియాతో పంచుకున్నారు ఆజాద్‌. 

కాంగ్రెస్‌ నిండా అధ్యక్ష ఎన్నికలతో విషం నిండుతోందని, ‘గాంధీ’ కుటుంబం పట్ల అయిష్టత పేరుకుపోతున్నా.. సల్మాన్‌ ఖుర్షీద్‌, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు రాహుల్‌నే అధ్యక్షుడిగా కోరుకోవడం దురదృష్టకరమని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ..రాహుల్‌ను మించినోళ్లు లేరు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top