జీహెచ్‌ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్‌ కార్పొరేటర్లు

GHMC Elections MLAs Viruses Corporators Political Conflicts - Sakshi

30 మంది సిట్టింగ్‌లకు టికెట్‌పై పేచీలు 

అధికార టీఆర్‌ఎస్‌లో జాబితా రెడీ

ఎమ్మెల్యే జాబితాలపై.. కార్పొరేటర్ల గుర్రు 

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ...కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్లలో టికెట్‌ గుబులు పట్టుకుంది. ఐదేళ్ల పనితీరు ప్రాతిపదికన  సీట్ల కేటాయింపు ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు చెక్‌చెప్పే యత్నాలు చేస్తుండటంతో నగరంలో అధికార టీఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పార్టీ అధిష్టానం ఇప్పటికే సర్వేలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణతో ప్రతి సీటుకు ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేయగా,  పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికే టికెట్‌ వస్తుందన్న ఇండికేషన్స్‌ ఇస్తున్నారు.  

ఎవరి జాబితాలు..వారివే  

  • ఉప్పల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి మెజారిటీ కార్పొరేటర్లకు ఏ మాత్రం సఖ్యత లేదు. ఎమ్మెల్యే ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసి తన ముఖ్య కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌ నుంచి గెలిచి మేయర్‌ పదవి చేపట్టిన బొంతు రాంమోహన్‌ ఈమారు తన భార్య శ్రీదేవిని అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారు. అయితే  స్థానిక నాయకులు తమలో ఒకరికే టికెట్‌ ఇవ్వాలని బాహాటంగానే తేల్చిచెప్పారు. 
  • మల్కాజిగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే హన్మంతరావు ముగ్గురు కార్పొరేటర్లను మారుస్తున్నామని,  ఈ మేరకు ప్రత్యామ్నాయ జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.   
  • కుత్బుల్లాపూర్‌లో ఓ కార్పొరేటర్‌ ప్రవర్తనపై జనమే విసిగిపోగా, మరో మహిళా కార్పొరేటర్‌ ఈమారు తాను పోటీ చేయటం లేదని ప్రకటించారు.  
  • కూకట్‌పల్లి, బేగంపేట డివిజన్ల విషయాల్లో ఎమ్మెల్యేల మధ్య పేచీ నెలకొంది. కూకట్‌పల్లి సిట్టింగ్‌ను కాదని ఇతరుల పేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిఫారసు చేస్తుండగా, సిట్టింగ్‌కే ఇవ్వాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పట్టుపడుతున్నారు. బేగంపేట డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌  స్థానంలో కొత్త అభ్యర్థిని మంత్రి శ్రీనివాసయాదవ్‌ తెరపైకి తెచ్చారు.  
  • శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, హైదర్‌నగర్‌ డివిజన్లలో కొత్త అభ్యర్థులను తెరమీదకు తేవాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం.   
  • ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో పాత టీఆర్‌ఎస్,  కొత్త టీఆర్‌ఎస్‌ విభేదాలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పలువురు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు పొసగటం లేదు. ఇక్కడ కూడా చంపాపేట, చైతన్యపురి, నాగోలు కార్పొరేటర్లను మార్చే యోచన ఉన్నట్టు సమాచారం.  
  • జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే గోపీనాథ్‌తో యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్‌ కార్పొరేటర్లకు తీవ్ర విభేదాలున్నాయి. ఈ ముగ్గురికి టికెట్‌ రాకుండా చూడాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉండగా, ఎలా రాదో మేమూ చూస్తామంటూ వారంటున్నారు.   
  • ఖైరతాబాద్‌ నియోకజవర్గంలో సోమాజిగూడ కార్పొరేటర్‌ అత్తలూరి విజయలక్ష్మి తాను పోటీ చేయనని ప్రకటించగా, మిగిలిన అన్ని చోట్ల హేమాహేమీ అభ్యర్థులు తిరిగి పోటీకి సిద్ధం అయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాత్రం మూడు చోట్ల అయినా తనవారికి కొత్తగా టికెట్లు ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.  
  • ముషీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని అడిక్‌మెట్, ముషీరాబాద్, సనత్‌నగర్‌లో బేగంపేట, మోండా, సికింద్రాబాద్‌లో తార్నాక కార్పొరేటర్లను మళ్లీ కొనసాగించే అంశంపై ఒకింత సందిగ్ధత ఉన్నట్టు సమాచారం. 
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top