స్నేహపూర్వక ప్రభుత్వమిది 

Gadikota Srikanth Reddy Comments On Employees PRC - Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి  

సీఎం జగన్‌ ఉద్యోగుల పక్షపాతి 

చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. ఉద్యోగులు ఆవేశాలకు లోనుకాకూడదు  

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే 1.30 లక్షల ఉద్యోగాలిచ్చింది 

ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ ఇచ్చారా? 

రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా 23 శాతం ఫిట్‌మెంట్‌   

ఉద్యోగులను ద్వేషించిన వారి ట్రాప్‌లో పడొద్దు 

సాక్షి, అమరావతి: తమది ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వమని, ఏ ఒక్కరినీ విస్మరించబోమని, రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా ముందుకు వెళ్లదని చెప్పారు. ఆవేశాలకు లోనై ప్రభుత్వాన్ని కించపరిచేలా కొంత మంది మాట్లాడుతుండటం సరైన పద్ధతి కాదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందని, ఇలా ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఇచ్చారా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే అధికారంలోకి రాగానే లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చిందని వివరించారు. శ్రీకాంత్‌ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

ఉద్యోగులకు నష్టం రానివ్వదు 
► ఉద్యోగులు నష్టపోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. పీఆర్‌సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలి. ఎక్కడా ఇంత పీఆర్‌సీ లేదు. కరోనా సమయంలోనూ సీఎం జగన్‌ రూ.18 వేల కోట్లు ఐఆర్‌ కింద ఇచ్చారు. ఆరోజున ఐఆర్‌ ఇవ్వకపోతే.. రూ.18,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడి ఉండేది కాదు. 
► ఆ రూ.18,000 కోట్లతో చిన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ క్లియర్‌ చేసి ఉండేవాళ్లం. గత ప్రభుత్వం రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. చేతికి ఎముకే లేదన్నట్లు తండ్రికి మించిన దానగుణం సీఎం జగన్‌లో ఎన్నోసార్లు చూశాం.  
► రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఉద్యోగులు వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు. ఉద్యోగుల సమస్యలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాదిది. 
► ప్రభుత్వ ఉద్యోగుల్ని కించపరిచే వారిని, బానిసలుగా చూసే వారిని గత ప్రభుత్వాల్లో చూశాం. బహిరంగ వేదికలపైన వేధించిన రోజులు అందరికీ గుర్తున్నాయి. పబ్లిక్‌గా ఓ పత్రికాధిపతి.. ఆనాడు సీఎంగా ఉన్న వ్యక్తితో కలిసి టీ తాగుతూ ఉద్యోగుల గురించి ఘోరంగా, అసభ్య పదజాలంతో మాట్లాడింది లైవ్‌లో అందరం చూశాం.  
► అలాంటి వారు ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగుల మేలు గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. వారి ట్రాప్‌లో పడొద్దు. వారిది ఆర్టిఫిషియల్‌ ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్‌ ఉద్యోగుల మంచి ఎలా కోరుకునే వారో అదే బాటలో సీఎం జగన్‌ ప్రభుత్వం నడుస్తోంది. 

ప్రభుత్వంపై బురదజల్లొద్దు  
కొంత మంది మాటలు విని రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లకండి. అందరం ఒకరికొకరు చేతులు కలిపి నడిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగులు పునరాలోచన చేయాలి. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ మనిషిగా చూడాలని, ఓటరుగా చూడొద్దన్న ప్రభుత్వం ఇది. సీఎం ఒకమాట చెబితే దానిపై నిలబడతారు. ఉద్యోగులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top