త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్‌రావు | Former Minister Harish Rao Tweets On Congress Corruption | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఆ బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతా: హరీష్‌రావు

May 30 2025 6:45 PM | Updated on May 30 2025 7:07 PM

Former Minister Harish Rao Tweets On Congress Corruption

సాక్షి, హైదరాబాద్‌: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్‌రావు ట్వీట్‌ చేశారు.

అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్‌లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్‌కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్‌లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్‌ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్‌ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్‌ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్‌రావు ట్వీట్‌ చేశారు.

..2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న  ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.

ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.

రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్‌మెంట్‌కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్‌లో తెలంగాణ  ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్‌రావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement