
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని సపోర్టు చేస్తున్నాడా? లేక రాహుల్ మనిషా? అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం అని వ్యాఖ్యలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
కాగా, కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్లలో ఈ మధ్య రేవంత్ దమ్ముంటే 17 ఎంపీ స్థానాల్లో బీఆర్‌ఎస్ ఒక్కటైనా గెలవాలి అన్నాడు. అక్కడ ఇక్కడా ఎందుకు రేవంత్ సిట్టింగ్ సీటు మాల్కాజ్‌గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని అన్నాను. కానీ, ఉలుకుపలుకు లేదు. నామినేషన్లకు ఇంకా సమయం ఉంది. నీకు దమ్ముంటే చెప్పు ఇద్దరం పోటీ చేద్దాం. నరుకుడు.. ఉరుకుడు తప్ప రేవంత్‌కు ఏదీ చేతకాదు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు.
రేవంత్ రెడ్డి మోదీ మనిషా? రాహుల్ గాందీ మనిషా? అర్దం కావడం లేదు. ఒక్క ఓటు రేవంత్ రెడ్డికి వేసినా అది మోదీకి వేసినట్టే. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరటం ఖాయం. ఈటల రాజేందర్ ఇంకా తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నాడు. గడిచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వం కంటోన్మెంట్‌కు ఏం చేసిందో దమ్ముంటే ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి. రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతాడు. అవి చూసి ఓట్లు వేయకండి. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాయకులే మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నారు. విషం చిమ్ముతున్న బీజేపీ, అబద్దాలతో బతుకుతున్న కాంగ్రెస్‌కు, మనకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఇస్తామన్న ఆరు గ్యారంటీలు పక్కకుపోయాయి. ఆరు గారడీలు తెర మీదకు వచ్చాయి.
ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్స్‌పై కూడా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 10 లక్షల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని రేవంత్ చెబుతున్నారు. ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. అవి దొంగ పనులు చేసేవారివి అనుకుంటాను. మీకు దమ్ముంటే విచారణ చేసుకోండి. రేవంత్ రెడ్డి ఓ లీకుల వీరుడు’ అంటూ ఎద్దేవా చేశారు.