
ముందు బీసీ నేతలు మహేశ్‌కుమార్ లేదా పొన్నంప్రభాకర్‌కు సీఎం పదవి ఇవ్వాలి
డిప్యూటీ సీఎంపై సివిల్, క్రిమినల్ చర్యలకు ముందుకెళతా
కేంద్రంపై నెపం నెట్టకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నోబెల్స్ స్థానంలో గోబెల్స్..ఆస్కార్‌కు బదులు భాస్కర్ అవార్డుకు సిఫార్సు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల, ఇతర అంశాలపై ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని..ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలంటున్న రేవంత్‌రెడ్డి..ముందు తన సీఎం పదవిలో బీసీ నేతలైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ లేదా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూర్చోబెట్టాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీకి బీసీల మద్దతుగా మెండుగా ఉండటంతో దానిని దూరం చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి అనేక రకాలుగా పార్టీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సివిల్, క్రిమినల్ చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు. కాళేశ్వరం అవినీతిలో ఒక అధికారి దగ్గరే రూ.150 కోట్లు దొరికాయని, అయితే ఇందులో రాజకీయ నేతలను మాత్రం టచ్ చేయలేదని చెప్పారు. ఇక వారి దగ్గర ఎంత పెద్ద మొత్తం ఉందో అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా అనేక అంశాలపై మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు
రాష్ట్రంలో పార్టీ సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నదని, అందుకు తగ్గట్టుగానే ప్రజల ఆదరణ పెరుగుతున్నందున వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని రాంచందర్‌రావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై నెపాన్ని పెట్టి తప్పించుకోకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ నుంచి బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు పార్టీలో తీవ్రపోటీ నెలకొందన్నారు. రాష్ట్ర పార్టీలోనూ సంస్థాగత పదవుల కోసం పోటీ ఉందని, అయితే కమిటీలో 20 మందికే అవకాశం ఉంటుందని, మొత్తం పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. హైడ్రా అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమమని, పేదల ఇళ్లు కూల్చినట్టే ఈ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందన్నారు. తాను కూడా బీసీనన్న (బ్రాహ్మిణ్ కమ్యూనిటీ) వ్యాఖ్యతో రామచందర్‌రావు మీడియా ప్రతినిధుల్లో నవ్వులు పూయించారు.