ఎన్నికల ప్రచార ఆంక్షల సడలింపు

EC Allows Public Meetings For tTe Ongoing Five State Assembly Polls - Sakshi

 బహిరంగ సభలు 30% సామర్థ్యం

ఇండోర్‌ సమావేశాలు 50% సామర్థ్యంలో జరుపుకునే వీలు

రోడ్‌ షోలు, పాదయాత్రలపై కొనసాగుతున్న నిషేధం

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షల్ని సడలించింది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలను ఏర్పాటు చేసుకోవడానికి ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సభలను నిర్వహించుకునే అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత ఫిబ్రవరి 10న మొదలు అవుతుండగా  ఫిబ్రవరి 8 సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసిపోతుంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా కేసులు  తక్కువగా నమోదు అవుతున్నాయని ఇప్పటికే ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ జనవరి 22న అత్యధికంగా 32 వేల కేసులు నమోదైతే ఫిబ్రవరి 5 నాటికి అయిదు రాష్ట్రాల్లో మొత్తం కేసుల సంఖ్య 7 వేలకు తగ్గిపోయింది. దీంతో ఎన్నికల సభలపై ఆంక్షల్ని సడలించిన ఈసీ రోడ్డు షోలు, పాదయాత్రలపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తోంది. ‘‘బహిరంగ సభలు, ఇండోర్‌ సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షల్ని సడలిస్తున్నాం. హాలుల్లో జరిగే సమావేశాల్లో 50% సామర్థ్యంతోనూ, బహిరంగ సమావేశాల్లో  ఆ గ్రౌండ్స్‌లో 30% సామర్థ్యంతో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికారులు విధించే ఆంక్షలకు అనుగుణంగా ఇవి మారుతాయి. ఏ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో హాజరవుతారో దానినే పాటించాలి’’ అని ఈసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.  

స్టార్‌ క్యాంపెయినర్లకి పకడ్బందీ భద్రత 
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా హపూర్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో స్టార్‌ ఆయా పార్టీల స్టార్‌ క్యాంపెయినర్ల భద్రతపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్‌ క్యాంపెయినర్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలంటే ఆయా పార్టీల ముఖ్య ప్రచారకర్తల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.  

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి నోటీసులు 
ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు హరీశ్‌ రావత్‌ ఫొటోని ముస్లిం మత ప్రబోధకుడిగా మార్ఫింగ్‌ చేసి, ట్విట్టర్‌లో షేర్‌ చేసినందుకు  కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర బీజేపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ స్పష్టం చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top