అట్టర్‌ప్లాప్‌ అయినా ఫర్వాలేదనుకుంటున్న పవన్‌!

Devulapalli Amar On Pawan Kalyan TS AP Political Steps - Sakshi

టాస్క్ అనే ఇంగ్షీషు పదానికి గూగుల్  తెలుగులో ఇచ్చే నిర్వచనం  ఒక పనికి ఒప్పుకోవడం. ‘‘టాస్క్’’ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎవరికి వారే ఒక పని సాధించాలని అనుకోవడం. ఆ కోవకు చెందిన వాళ్ళకు స్పష్టత ఉంటుంది. అది తాము వెళ్ళే మార్గం పట్లా.. చేరుకోవాల్సిన గమ్యం పట్లా!. ఇక రెండో కోవకు చెందిన వాళ్ళు ఎవరో ఇస్తే చేసే పని. ఇటువంటి వారికి మార్గం , గమ్యం దేని పట్లా స్పష్టత ఉండదు. పని ఇచ్చిన వాడు ఏం చెప్తే అది చేయాలి.. ప్రతిఫలం తీసుకోవాలి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒక టాస్క్‌కు ఒప్పుకున్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాడు. ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన నిర్వాకాన్ని విశ్లేషించి నట్టయితే ఆయన మనం ముందు చెప్పుకున్న రెండో కోవకు చెందిన వ్యక్తి అని ఎవరికయినా అర్ధం అవుతుంది . తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆయనకో టాస్క్ ఇచ్చాడు . 

  • 2014 లో విభజిత  ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశాన్ని అధికారం లోకి తీసుకురావడం 
  • 2019 లో తెలుగు దేశం తిరిగి గెలిచేట్టు చూడటం 
  • 2024లో బీజేపీని దగ్గర చేర్చి మళ్ళీ తెలుగు దేశం అధికారం లోకి రావడానికి ప్రయత్నించడం 

ఈ మూడు పనుల్లో ఆయన విఫలం కావడమే కాక రెంటికీ చెడ్డ రెవడి సామెత అయ్యింది ఆయన పని. 2014 లో ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం గెలవడానికి పవన్ కల్యాణ్ చేసిందేమీ లేదు , మోదీ హవా బలంగా వీస్తున్న సమయం అది .

చంద్రబాబు నాయుడు ఇచ్చిన పని చేసే ధ్యాసలో పడి  పోయి పవన్ తన పార్టీ గురించి మర్చిపోయాడు . ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే ఎవరయినా ముందు తన పార్టీ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారు . ఆ పార్టీ బలోపేతం అయితేనే కదా ఇంకెవరికాయినా సహాయం చేయగలిగేది. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఆ మాట చెప్పడు. ఎందుకంటే పవన్ పార్టీ బలం పుంజుకుంటే మళ్ళీ తనకే నష్టం అని ఆయనకు బాగా తెలుసు . అందుకే పవన్ పార్టీ  నిద్రావస్థలోనే  ఉండాలి అతను మాత్రం తన కోసం పని చేయాలి.. ఇదీ బాబు ఆలోచన .

తాను ఎన్డీయే భాగస్వామిననీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , హోం మంత్రి అమిత్‌ షా తాను పిలిస్తే పలుకుతారనీ పవన్ తరచూ చెప్తూ ఉంటాడు . పట్టుమని పది పంచాయితీలను గెలుచుకోలేని పార్టీని, దాని నాయకుడిని రాజకీయాల్లో రాటు తేలిన బీజేపీ ఎందుకు పక్కన పెట్టుకుంటున్నదో  అర్ధం చేసుకోలేని స్థితి పవన్‌ది. 

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14 రోజులు అన్నపానీయాలు మాని ఏడుస్తూ పడుకున్నానని ఆంధ్ర ప్రదేశ్‌కు  వెళ్ళి బహిరంగ సభల్లో చెప్పుకున్న పవన్.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ముందు ప్రకటించాడు. బీజేపీతో పొత్తులో చివరికి ఎనిమిది స్థానాలకే సంతృప్తి పడ్డాడు. ఆ ఎనిమిది స్థానాల్లో కూడా అభ్యర్ధులు కరువై బీజేపీ వాళ్ళకే పవన్ పార్టీ కండువాలు కప్పారంటే ముందే చెప్పినట్టుగా పార్టీ నిర్మాణం మీద ఆయన శ్రద్ద చూపించారో అర్ధం అవుతుంది. తెలంగాణా ఎన్నికల వాలకం చూస్తే ఆయన పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు వస్తాయనే నమ్మకం కూడా లేదు . పోటీ చేసిన అన్నీ చోట్లా డిపాజిట్లు పోగొట్టుకోవడం ఆయన పార్టీకి కొత్త ఏం కాదు .

తెలంగాణ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే ఆంధ్ర ప్రదేశ్‌లో శాసన సభకూ, లోక్‌సభకూ ఎన్నికలు జరుగుతాయి . తెలంగాణలో బీజేపీ తో దోస్తీ , ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్ళి తెలంగాణ లో బోర్డ్ తిప్పేసిన తెలుగు దేశంతో దోస్తీ పవన్ రాజకీయ గందరగోళానికి అద్దం పడుతుంది. 

నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెట్టుకుని, ఆ ఎన్నికల్లో తాను ప్రధాన పాత్ర పోషించబోతున్నానని చెప్పుకునే ఏ రాజకీయ నాయకూడూ పవన్ చేసిన తప్పు చేయడు  కదా!. తనకు పని ఇచ్చిన చంద్ర బాబు ఎట్లాగూ ఇటువంటివి చెప్పడు. ఆయనను చూసైనా పవన్ జాగ్రత్త పడాలి కదా. అలా కాకుండా తెలంగాణాలో నవ్వులపాలయి ఆంధ్ర ప్రదేశ్ కు వెళితే చంద్రబాబు పార్టీ 16 స్థానాలిచ్చి అక్కడికంటే రెట్టింపే  ఇచ్చాం సరిపెట్టుకో అనడం  ఖాయం.

సినిమా పోతే పోయింది , హీరో రెమ్యునరేషన్ వొస్తే చాలు కదా!. నిర్మాతలు, ప్రేక్షకులూ (నమ్ముకున్న పార్టీ నాయకులు , కార్యకర్తలు ) ఏమైపోతే ఏం .

:::దేవులపల్లి అమర్, 
రాజకీయ విశ్లేషకులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top