కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌.. ఆడియో షేర్‌ చేసిన కాంగ్రెస్‌

Congress Shares A Video Alleges Phone call Audio By KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రచార ముగింపు వారం రోజులే ఉండటంతో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 119 నియోజవర్గాల్లోని గల్లీగల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ వాడ, ఊరిలో చూసిన ప్రచార సభలు, రోడ్‌షోలే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ప్రజలకు హామీల  వర్షం కురిపిస్తున్నారు. 

ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్‌, బీజేపీ ‍ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌లీక్‌ అయ్యిందంటూ కాంగ్రెస్‌ ఓ ఆడియో కల​ఇప్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్‌ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్‌ వాయిస్‌తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది.

ఈ ఆడియోలో.. వారం రోజుల్లో ప్రచారం ముగిస్తుందని.. ఈ కొన్ని రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్‌ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా.. కౌన్సిలర్లు, సర్వంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్‌ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు  క్లాస్ తీసుకున్నారు.

రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్‌ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు వినిపిస్తుంది. గతంలో కాకుండా వచ్చే ఎన్నికల తర్వాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండంటూ పేర్కొన్నారు. ఇక  కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top