బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌ రెడ్డి.. కేసీఆర్‌ సమక్షంలో చేరిక? | Congress Jeevan Reddy Will Join BRS Party For Jagtial Issue | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌ రెడ్డి.. కేసీఆర్‌ సమక్షంలో చేరిక?

Mar 22 2026 9:25 AM | Updated on Mar 22 2026 9:27 AM

Congress Jeevan Reddy Will Join BRS Party For Jagtial Issue

సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. జీవన్‌ రెడ్డి ఏప్రిల్‌ ఐదో తేదీన బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్‌ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్‌ ఐదో తేదీన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు  జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్‌ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్‌ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement