జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్‌ మరో కీలక నిర్ణయం | CM Vijay Appointed His Personal Astrologer Radhan Pandit Vetrivel As OSD | Sakshi
Sakshi News home page

జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్‌ మరో కీలక నిర్ణయం

May 12 2026 3:55 PM | Updated on May 12 2026 4:27 PM

CM Vijay Appointed His Personal Astrologer Radhan Pandit Vetrivel As OSD

సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్‌ షాపులను మూసివేయాలని సీఎం విజయ్‌ నిర్ణయం తీసుకున్నారు.  
ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్‌ తీసుకున్న మరో  నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు?  
గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.

విజయ్‌తో సంబంధం  
ఎన్నికలకు ముందు విజయ్‌ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే, విజయ్‌ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి విరిచేవారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement