సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు
పిప్రి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్లలో మీరు చేయలేని ఎన్నో గొప్ప పనులు చేశాం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం... పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం
గత ప్రభుత్వం సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా? అంటూ నిలదీత
పాదయాత్ర సందర్భంగా ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ: డిప్యూటీ సీఎం భట్టి
రూ. 614 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన రేవంత్, భట్టి
ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా?
‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్‌లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్‌లో, నిర్మల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.
డిసెంబర్‌లో ఇందిరమ్మ చీరలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్‌లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ
‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు.
పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం
‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు.
ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ఎస్‌హెచ్‌జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.


