బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ! | Sakshi
Sakshi News home page

బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ!

Published Fri, Apr 26 2024 4:24 AM

CM Revanth Reddy fire in Rajendra nagar road show

బ్రిటిష్‌ వాళ్లలా మోదీ, అమిత్‌ షా ఆక్రమణ ఎజెండా అమలు చేస్తున్నారు 

రాజేంద్రనగర్‌ రోడ్‌ షోలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ 

బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోంది 

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  నాడు వ్యాపారం ముసుగులో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వాళ్లు దేశాన్ని ఆక్రమించుకునేందుకు సూరత్‌ నుంచి బయలుదేరి వచ్చారని.. నేడు అదే సూరత్‌ నుంచి మోదీ, అమిత్‌షా బయలుదేరారని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటీష్‌ జనతా పార్టీ అని.. ఇక్కడ బ్రిటిష్‌ వాళ్లలా ఆక్రమణ ఎజెండాను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 
 

బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అమలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సెగ్మెంట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ రోడ్‌ షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నారు. వారికి ఏ ఒక్కరోజు కూడా ప్రజలు గుర్తుకురాలేదు. బీజేపీని 400 సీట్లలో గెలి పించాలని మోదీ అంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేయడం ఖాయం. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కొత్తకాదు. 70 ఏళ్లు ఈ దేశాన్ని పాలించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. ఆ రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

రూ.లక్ష కోట్లతో మూసీ అభివృద్ధి..: వికారాబాద్‌లో మొదలైన మూసీ నది నల్లగొండ దాకా కలుషితంగా మారిపోయింది. ఈ మూసీని ప్రక్షాళన చేసి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను అభివృద్ధి చేయాలన్నా.. వికారాబాద్‌ను పర్యాటక ప్రదేశంగా మార్చాలన్నా చేవెళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిను గెలిపించాలి. గతంలో కాంగ్రెస్‌ పాలనలో వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ, ఎంఎంటీఎస్‌ రైలును మంజూరు చేస్తే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది. రూ.లక్ష కోట్లతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తాం. కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు భూముల ధరలు పెంచే బాధ్యత నాది. 

మతవాదులకు బుద్ధి చెప్పాలి: దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ వాళ్లు ఇప్పుడే శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతిని కనిపెట్టినట్టు చెప్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ వాదులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. కానీ ఆయన బీజేపీలో చేరి కలుషితమయ్యారు. చేవెళ్లలో రంజిత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. 

బిడ్డకు బెయిల్‌ కోసం బలహీన అభ్యర్థి: కేసీఆర్‌ సీఎంగా పదేళ్లు కొనసాగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. బీఆర్‌ఎస్‌ కారు పనైపోయింది. ఇది తెలిసే కేసీఆర్‌ బస్సు వేసుకుని బయలు దేరారు. ఆయన ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రజలు నమ్మడం లేదు. బిడ్డకు బెయిల్‌ కోసమే చేవెళ్లలో బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపారు..’’అని పేర్కొన్నారు. 

సంక్షేమానికి పెద్ద పీట వేసేది కాంగ్రెసే..: రంజిత్‌రెడ్డి 
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హామీలను అమలు చేసి మాట నిలబెట్టు కుందని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి చెప్పారు. రాజేంద్రనగర్‌ రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రస్తుతం సెక్యులర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మతతత్వ బీజేపీ మధ్య పోరు జరుగుతోందని వ్యాఖ్యానించారు.  

కంటోన్మెంట్‌ సమస్యలు తీరుస్తాం..: రేవంత్‌ 
రసూల్‌పురా (హైదరాబాద్‌): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని బాలంరాయి కమాన్‌ నుంచి అన్నానగర్‌ వరకు నిర్వహించిన రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
 

కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కంటోన్మెంట్‌ ప్రాంతంలో రోడ్లు మూసేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఇక్కడ రిజి్రస్టేషన్ల విషయంలో, తాగునీటి విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ‘‘కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్న నాకు మంచి మిత్రుడు. 
 

ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉండగా మరణించారు. అయినా కేసీఆర్‌ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయించలేదు. అదే సినిమా వాళ్లు చనిపోతే మాత్రం ఏడు రౌండ్లు గాల్లోకి పోలీసు కాల్పులతో అధికార లాంఛనాలు చేయించారు..’’అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్‌లను గెలిపించాలని పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement