కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Kaleshwaram Project In Assembly | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్‌

Sep 1 2025 4:32 AM | Updated on Sep 1 2025 7:33 AM

CM Revanth Reddy Comments On Kaleshwaram Project In Assembly

ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

అసెంబ్లీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై చర్చ అనంతరం సీఎం రేవంత్‌ ప్రకటన

కమీషన్లు దండుకునేందుకు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని ఆరోపణ 

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రాజెక్టు కూలిందని వెల్లడి..

కేసీఆర్, హరీశ్, ఈటల సహా అధికారులే బాధ్యులని స్పష్టీకరణ 

కేసీఆర్‌ దోపిడీ దొంగగా మారి రూ. లక్ష కోట్ల తెలంగాణ సొత్తు దోచుకున్నారని ధ్వజం 

కేసీఆర్, ఆయన కుటుంబానికి ఫాంహౌస్‌లు,మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీత

అర్ధరాత్రి 1:40 గంటల వరకు నివేదికపై కొనసాగిన చర్చ

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్‌రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్‌ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్‌ పీసీ ఘోస్‌ విచారణ కమిషన్‌ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. 

లోతైన దర్యాప్తు అవసరం.. 
‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్‌ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్‌ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్‌ విచారణ కమిషన్‌ నివేదికలో క్రిమినల్‌ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 

మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్‌ తేల్చిచెప్పింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్‌ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్‌డీఎస్‌ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్‌డీఎస్‌ఏ విచారణ కమిషన్‌ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు 
‘కేసీఆర్‌ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్‌ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్‌ దోచుకున్నాడు. 
 


కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. 

అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్‌రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్‌ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్‌ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 

నేను ఢిల్లీకి సర్కస్‌ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్‌ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్‌ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్‌. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement