
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారని.. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి తమ బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లుగా పెడితే వాస్తవంగా వ చ్చినది రూ.2.20 లక్షల కోట్లేనని చెప్పారు.
నీటిపారుదల శాఖ చేసిన అప్పులపై రూ.16 వేల కోట్లను వడ్డీ కింద కట్టాల్సి వస్తోందన్నారు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. శనివారం శాసనసభ వాయిదాపడ్డాక అసెంబ్లీలోని తన చాంబర్‌లో రేవంత్ మీడియాతో చిట్‌చాట్ చేశారు.
‘‘ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మొదట్లో నిషూ్టరంగా అనిపించినా.. మిగతా ఏడాదంతా వాస్తవాలు చెప్పవచ్చన్నదే మా ఉద్దేశం. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించేందుకు ఉన్న కాస్త సమయంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రయతి్నంచారు..’’అని వివరించారు.
మేడిగడ్డకు అందరినీ ఆహ్వానిస్తున్నాం..
ఈ నెల 13న మేడిగడ్డ సందర్శన కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను తీసుకెళతామని రేవంత్ చె ప్పారు. ‘‘బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ వస్తారా, ఇతరులను పంపుతారా అనేది వారి ఇష్టం. 13న నల్ల గొండలో బీఆర్‌ఎస్ సభ ఉన్నందున.. మరో తేదీన వస్తామని బీఆర్‌ఎస్ వాళ్లు చెప్పినా తీసుకెళ్లేందుకు మేం సిద్ధం. కాళేశ్వరంపై కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతాం. విజిలెన్స్ ప్రాథమిక విచారణ ఆధారంగా అధికారులపై చర్యలు చేపట్టాం.
సాంకేతిక నిపుణుల బృందం నివేదిక, జ్యుడీషియల్ విచారణలో తేలే అంశాల ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపడతాం. ఇతర శాఖలపైనా సమీక్షించి మోతాదుకు మించి తప్పిదాలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం..’’అని రేవంత్ పేర్కొన్నారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై 12న వివరంగా చర్చిస్తామని తెలిపారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని, అవసరం లేకున్నా కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు.
‘అమరుల జ్యోతి’పైనా విచారణ!
హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన అమరుల జ్యోతి, అంబేడ్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంచనాలు, చెల్లింపులు, నాణ్యతా లోపం మీద విచారణకు ఆదేశిస్తున్నామని రేవంత్ చెప్పారు. ‘‘అమరుల జ్యోతి దేనికోసం కట్టారో, అందులో ఏముందో తెలియదు. అద్భుతాల పేరిట తక్కువ ఖర్చులో పూర్తయ్యే పనికి ఎక్కువ ఖర్చు చేయడం సరికాదు.
ఫార్ములా–ఈ రేసింగ్‌పై సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు అక్రమంగా భూములు కొనుగోలు చేసిన అంశంపై ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం..’’అన్నారు. గతంలో జాతీయ రహదారులు, గుట్టలు, సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని.. తాము సాగుచేసే రైతులు, కౌలుదారులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నామన్నారు.
మహిళలకు లబ్ధి చేకూరే పథకాలను ముందుగా చేపడుతున్నట్టు వివరించారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఆరోగ్యభద్రత కార్డుకు రేషన్‌కార్డు లింక్‌ను వేరుచేస్తామని తెలిపారు. అసెంబ్లీ బీఏసీ భేటీకి హరీశ్‌రావును అనుమతించడం స్పీకర్ విచక్షణకు సంబంధించినదన్నారు. 2014లో టీడీపీ తనను బీఏసీకి నామినేట్ చేసినా ఎర్రబెల్లికి ఒక్కరికే అవకాశమిచ్చి తనను బయటికి పంపారని గుర్తు చేశారు.
నేను మాట్లాడేది తెలంగాణ భాష
విపక్ష నేతలను దూషిస్తున్నట్టుగా వస్తున్న విమర్శలపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఆ మాటల విషయానికి వస్తే.. నేను మాట్లాడుతున్నది తెలంగాణ భాషే కదా..’’అని వ్యాఖ్యానించారు. తనను కలసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనుమానించడం సరికాదన్నారు. తమ నేత జగ్గారెడ్డి చెప్పినట్టుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.