
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. కేవలం పది వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించం ఏంటి? అని మాన్ విమర్శించారు. ఈ క్రమంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పూర్తిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది.
ఇటీవల ప్రధాని మోదీ.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటనలపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఓ కార్యక్రమంలో సీఎం మాన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ.. చిన్న చిన్న దేశాలకు సైతం వెళ్తున్నారు. ఘనా అని ఎక్కడికో వెళ్లారు. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం. ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు. కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు.
#Punjab CM Bhagwant Mann makes Fun of PM Modi
ਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਮੋਦੀ ਫਿਰ ਮਜ਼ਾਕ ਉਡਾਇਆ#Punjab CM Doin'it Again !
CM Bhagwant Mann makes Fun of PM Modi foreign trips & also asks the Journos now you will ask the questions of Modi also from me. Mann says he didn't do 1 PC in 11 yrs, I… pic.twitter.com/tqmpoyUzt4— Punjab Spectrum (@PunjabSpectrum) July 10, 2025
ఈ నేపథ్యంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.
కాంగ్రెస్ కౌంటర్..
మరోవైపు.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. ప్రధాని మరో విదేశీ పర్యటనకు వెళ్లేలోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో! ఇప్పుడైనా మణిపూర్ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో, లేదో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, మణిపూర్ విషయమై.. ఇప్పటికే కాంగ్రెస్.. మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.