
కోపం నటిస్తూ బాబు.. భయం నటిస్తూ నేతలు..
ఇదంతా లైట్ తీస్కో మామా అంటున్న ఎమ్మెల్యేలు
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.
ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.
తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.
నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.
ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.
ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.
-సిమ్మాదిరప్పన్న