చంద్రబాబు, లోకేశ్‌ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు  | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు 

Published Wed, Apr 24 2024 4:38 AM

Chandrababu family understating assets by showing their separate assets - Sakshi

వారి కుటుంబానికి హైదరాబాద్, తమిళనాడులో ఎక్కువ ఆస్తులు 

హైదరాబాద్‌లో సొంతిల్లు, ఫామ్‌హౌస్‌.. సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం సొంతిల్లు కూడా లేదు 

ఆస్తుల విలువను తక్కువగా చూపిన తండ్రీకొడుకులు.. మదీనాగూడలోని ఫామ్‌ హౌస్‌ విలువే రూ.500 కోట్లు 

దాని విలువ కేవలం రూ.100 కోట్లుగా చూపిన వైనం  

రెండేళ్ల వయసులోనే ఆస్తి కొన్న దేవాన్ష్ 

విడివిడిగా ఆస్తులు చూపించి తక్కువగా చెప్పుకుంటున్న చంద్రబాబు కుటుంబం 

సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్‌లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్‌ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్‌ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్‌ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే.  

లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్‌ షేర్ల విలువే రూ.1102 కోట్లు  
చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు.

అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్‌ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. 

ఆస్తుల విలువ తగ్గించి చూపారు 
చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్‌ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు.

10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు.  

రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ 
చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. 
 
చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 
1. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 
2. కుప్పం నియోజకవర్గం  శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 
3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. 
 
భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 
1. హైదరాబాద్‌ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్‌ హౌస్‌). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 
2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్‌ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. 
 
లోకేశ్‌ స్థిరాస్థులు 

1. హైదరాబాద్‌ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 
2. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. 
 
బ్రాహ్మణి స్థిరాస్థులు 

1. హైదరాబాద్‌ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 
2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 
3. హైదరాబాద్‌ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 
4. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 
5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. 
 
దేవాన్ష్ స్థిరాస్థులు 
21. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు.   

Advertisement
Advertisement