అడవికి రాజెవరో? | The caras party is at the forefront of the campaign | Sakshi
Sakshi News home page

అడవికి రాజెవరో?

Published Fri, Oct 13 2023 4:57 AM | Last Updated on Fri, Oct 13 2023 4:57 AM

The caras party is at the forefront of the campaign - Sakshi

ఆకుల రాజు :  అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఓట్ల వేట హోరాహోరీగా సాగనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం అప్పుడే ముమ్మరంగా నడుస్తోంది. భౌగోళికంగా చూస్తే పశ్చిమ ప్రాంతంగా ఉన్న నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్, తూర్పున మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలు మైదాన, గిరిజన, కోల్‌బెల్ట్‌ ఓటర్లతో నిండి ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజన, ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. 

పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌.. బోణీ కొట్టేందుకు బీజేపీ పోరాటం 
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ పదింటా ఒక్కో స్థానానికే పరిమితమైంది.  ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. పది స్థానాలకు 94మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పూర్వ వైభవం వస్తుందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని బీజేపీ ఈసారి సత్తా చాటేందుకు చెమటోడుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఆదిలాబాద్‌ ఎంపీగా సోయం బాపురావు గెలవడంతో పార్టీకి హైప్‌ తెచ్చింది. ఈసారి కచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో కమలనాథులు ఉన్నారు. 

ప్రచారంలో ‘కారు’ స్పీడు.. 
అభ్యర్థులను ముందే ప్రకటించి ‘కారు’ పార్టీ ప్రచారంలో స్పీడ్‌గా ఉంది. అభ్యర్థులు తమ పర్యటనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పదే పదే వల్లె వేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా, ప్రస్తుతం బీజేపీతోపాటు కొన్ని చోట్ల బీఎస్పీ, సీపీఐ అభ్యర్థులు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేయనున్నాయి. ముప్పై ఏళ్ల రాజకీయం, ఐదు ఎన్నికలను ఎదుర్కొన్న మంత్రి ఐకే రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుతో పాటు ఎన్నికలంటే తెలియని, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌ లాంటి వారు కూడా పోటీలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. 

విపక్షాల ప్రచార అస్త్రాలు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు  
 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళిత, బీసీ బంధు  అర్హులందరికీ రాకపోవడం 
 ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం చూపకపోవడం 
గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం, రోడ్లు లేకపోవడం 
జిల్లాల్లో మూత పడిన పరిశ్రమలు తెరవకపోవడం 

అధికార పార్టీ ప్రచారాస్త్రాలు 
48వేల మందికి, లక్ష ఎకరాల   పోడు పట్టాల పంపిణీ  
♦ ఏడు వేలకు పైగా సింగరేణి స్థలాలకు ఇళ్ల పట్టాల పంపిణీ 
 ♦మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు 
♦ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల   లబ్దిదారులు 

బోథ్, ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌కు ఇక్కట్లు 
ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు బదులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ స్నేహితుడైన భూక్య జాన్సన్‌ నాయక్‌కు, బోథ్‌లో రాథోడ్‌ బాçపూరావును కాదని అనిల్‌కుమార్‌ జాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కును పక్కకు పెట్టి, గత ఎన్నికల్లో ఓడిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, కుమురంభీం జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్షి్మకి మళ్లీ అవకాశం ఇచ్చారు. దీంతో ఖానాపూర్, బోథ్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతామని ప్రకటించారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇక చెన్నూరులో ఎమ్మెల్యే సుమన్‌తో పొసగక, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ వీడి కాంగ్రెస్‌ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. టికెట్‌ దక్కని మాజీ ఎంపీ నగే«శ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ పార్టీలోనే ఉన్నా అంటీముట్టనట్టు ఉంటున్నారు. 

బహుజనవాదంతో బీఎస్పీ
బహుజన వాదంతో ఇక్కడి ఓట్లను పట్టేందుకు బీఎస్పీ సిద్ధమైంది. సిర్పూర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బరిలో ఉంటానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఖానాపూర్‌లో బన్సీలాల్‌కు అవకాశం ఇచ్చారు. 

కామ్రేడ్ల ఆశలు 
బెల్లంపల్లి నుంచి సీపీఐ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ బలంతో కార్మిక వాడల్లో నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే..సీటు ఇస్తారో లేదా చూడాలి.

సామాజిక సమీకరణాలు 
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్, ముథోల్‌లో బీసీ ఓట్లు. ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్‌లో ఎస్టీ ఓట్లు, బెల్లంపల్లిలో నేతకాని, ఎస్సీ చెన్నూరులో నేతకాని, ఎస్సీ ఓట్లు మంచిర్యాలలో పెరిక, మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, గౌడ ఓట్లు, ఆదిలాబాద్‌లో మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, ముదిరాజ్, నిర్మల్‌లో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, సిర్పూర్‌లో గిరిజన, బుద్ధిస్టు, ముస్లిం, ముథోల్‌లో ముస్లిం ఓట్లు గెలుపోటముల్లో కీలకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement