రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్‌ఎస్‌ చెక్‌. | BRS Plan To Control Mynampally Hanumantha Rao And His Son In Two Places Over Contest For TS Assembly Elections - Sakshi
Sakshi News home page

రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్‌ఎస్‌ చెక్‌.

Published Tue, Oct 3 2023 12:21 PM

BRS Plan To Control Mynampally Hanumantha Rao And His Son Contest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ కేటాయించినా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడటాన్ని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి, మెదక్‌ నుంచి ఆయన కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా మైనంపల్లిని కట్టడి చేసేందుకు బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది.

అందులో భాగంగా మెదక్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మల్కాజ్‌గిరి టికెట్‌ ఆశించిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతిరెడ్డి మూడ్రోజుల క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని సేవలందిస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడాన్ని అటు తిరుపతిరెడ్డి, ఇటు నందికంటి శ్రీధర్‌ ప్రశ్నిస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
చదవండి: లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య

Advertisement

తప్పక చదవండి

Advertisement