
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ నేతలు నిరసనలకు దిగారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు.

రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..
యూరియా రైతుల హక్కు...
అది అందకుండా చేయడం
కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025
దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు.