వచ్చే నెల 6న వరంగల్, 9న హైదరాబాద్‌లో ప్రత్యేక సభలు
గతంలో కాంగ్రెస్ డిక్లరేషన్లు విడుదల చేసిన చోటే బీఆర్‌ఎస్ సభలు
వరంగల్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సన్నద్ధత
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల ద్వారా సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్‌ఎస్.. మరో వైపు క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవల జగిత్యాల బహిరంగ సభతోపాటు, రెండు రోజుల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘డిక్లరేషన్ల’పై సమర భేరి మోగించనుంది. కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలను నిర్వహించి వాటి అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మే 6న వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ అమలు వైఫల్యంపై సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మే 9న హైదరాబాద్‌లో ‘యూత్ డిక్లరేషన్’అమల్లో డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇదే తరహాలో ఏడాది పాటు కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన తేదీల్లో, ఆ పార్టీ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
ఆరు డిక్లరేషన్లు.. ఆరు చోట్ల సభలు
2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకొని 2023 నవంబర్ వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది.
– వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’సభకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు.
– హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్ ’సభకు ప్రియాంకగాంధీ వచ్చారు.
–చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
– 2023 నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’సభకు కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, మరుసటి రోజు నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు. ఈ సభల్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
వచ్చే ఏడాది భారీ బహిరంగ సభలు
కాంగ్రెస్ డిక్లరేషన్ల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్‌ఎస్ ప్రస్తుతం మినీ సభలు లేదా సమావేశాలకే పరిమితం కావాలని భావిస్తోంది. కేటీఆర్ ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2028లో కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోట పోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. డిక్లరేషన్ల వారీగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పేలా ప్రచార సామగ్రిని కూడా బీఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 6న వరంగల్‌లో జరిగే ‘రైతు డిక్లరేషన్’పై నిరసన సభను హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానం లేదా సమీపంలోని ఏదైనా హాల్‌లో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ఆ లోపే మే 2, 3, 4, 5 తేదీల్లో పార్టీ నేతలు జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆందోళన కార్యక్రమాలు చేపడతారు.
కార్పొరేషణ్ల ఎన్నికల నేపథ్యంలో...
గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మణుగూరు, మందమర్రి, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
సభ్యత్వ నమోదుపైనా కసరత్తు
గతంలో 60లక్షలకు పైగా సభ్యతాన్ని నమోదు చేసిన బీఆర్‌ఎస్ ఈసారి రాశి కన్నా వాసి ముఖ్యమని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల జాబితాను బీఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సర్ పర్యవేక్షణకు బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను ఇవ్వాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఆదేశించింది.


