
స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే రిజర్వేషన్ బిల్లు
ఆర్డినెన్స్‌నే ఆమోదించని గవర్నర్.. బిల్లును ఓకే చేస్తారా?
ప్రధాని, రాహుల్‌గాంధీ అరగంట చర్చిస్తే రిజర్వేషన్లు వస్తాయి
శాసనసభలో మున్సిపల్ చట్టసవరణ బిల్లుపై చర్చలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదని, డెడికేషన్ అని అన్నారు. శాసనసభలో ఆదివారం పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీ, ప్రధానమంత్రి అరగంటపాటు మాట్లాడుకుంటే అనుకున్న తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు.
పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నిజంగా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఎన్ని గంటలు చర్చించినా ఉపయోగం ఉండదు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. తెలిసి కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఐదు నాలుకలు, ఐదు స్వరాలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అని ఇంకోసారి, పార్టీ పరంగా అని మరోసారి, రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత అని ఓసారి, ఇప్పుడేమో బిల్లు తెచ్చి చేస్తామని అంటున్నారు. ఇదంతా బీసీలు గమనించటం లేదనుకుంటున్నారా?’అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ గత ప్రభుత్వంలో పెట్టారంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లే రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగులో ఉంది.
దాన్ని వెనక్కి తెప్పించి ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఆర్డినెన్స్‌పైనే సంతకం చేయని గవర్నర్, ఇప్పుడు బిల్లుపై సంతకం చేస్తారని ఎలా భావిస్తున్నారు? జిత్నీ ఆబాదీ ఉత్నా హఖ్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ’అని చెప్పే రాహుల్‌గాంధీ బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ నిలదీశారు.
ఆర్థికంగా ఎదిగినప్పుడే న్యాయం..
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గిందని తేలినా దానిపై సమీక్షించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడంతోనే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యతతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం.
మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచి్చన వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రి సన్నిహితుడైన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీఓలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు.