‘చాటింగ్‌’.. పొలిటికల్‌ ఫైటింగ్‌ | BJP TRS Fight For Huzurabadbypoll 2021 | Sakshi
Sakshi News home page

‘చాటింగ్‌’.. పొలిటికల్‌ ఫైటింగ్‌

Jul 30 2021 1:12 AM | Updated on Jul 30 2021 5:04 AM

BJP TRS Fight For Huzurabadbypoll 2021 - Sakshi

‘దళిత ద్రోహి ఈటల రాజేందర్‌’ అంటూ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్వీ నాయకులు

హుజూరాబాద్‌: ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాలేదు.. పోలింగ్‌ ఎన్నడో తెలియదు.. అభ్యర్థులు ఎవరో తేలలేదు.. అయినా హుజూరాబాద్‌లోఎన్నికల యుద్ధవాతావరణం నెలకొంది.. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి దళితులను కించపర్చారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఆ తర్వాత ఈటల సతీమణి జమునారెడ్డి తాము దళితులను కించపరిచే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఫేక్‌ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారంటూ స్థానిక చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నేత మొలుగు పూర్ణచందర్‌తోపాటు మరో 10 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ‘దళితద్రోహి ఈటల’ అని నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. కేసీఆర్‌ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌–జమ్మికుంట ప్రధాన రహదారిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుస్టేషన్‌లో ఒకరి మీద మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

చాటింగ్‌ చూసి ఆశ్చర్యపోయా: మధుసూదన్‌రెడ్డి, ఈటల బావమరిది 
సోషల్‌ మీడియాలో నేను చేసినట్లు వచ్చిన చాటింగ్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా కల్పితం, అవాస్తవం. ఈటలను ఎదుర్కోలేక చేస్తున్న కుట్ర ఇది. ఇలాంటి వార్తను తయారు చేసినవారిని, ప్రచారం చేసినవారిని పోలీసులు గుర్తించి 48 గంటల్లో బయటపెట్టాలి. లేదంటే, కమిషనర్‌ ఆఫీస్‌ దగ్గరే నిరసన వ్యక్తం చేస్తాం. 

ఈటల కుటుంబసభ్యులపై కేసు పెట్టాలి: టీఆర్‌ఎస్వీ 
ఈటల బావమరిది కె.మధుసూదన్‌రెడ్డి తన మిత్రుడితో జరిపిన వాట్సాప్‌ చాటింగ్‌లో దళితులను కించపరిచారంటూ టీఆర్‌ఎస్వీ నేతలు మొలుగు పూర్ణచందర్, టేకుల శ్రావణ్, కొలుగూరి సూర్యకిరణ్, లంకదాసరి కళ్యాణ్, చల్లూరి విష్ణువర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి మధుసూదన్‌రెడ్డిపై, ఈటల కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. 

‘దళితులంటే అపార గౌరవం’
దళితులంటే మాకు అపారమైన గౌరవం ఉంది. వారిని ప్రేమగా చూసే వాళ్లం. టీఆర్‌ఎస్‌ నాయకులు, వారి బానిసలు తప్పుడు వార్తలు తయారు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇవన్నీ కేసీఆర్‌ కుట్రలు. దళిత బంధును హుజూరాబాద్‌తోపాటు రాష్ట్ర మంతా ఇవ్వాలి. రాజేందర్‌ రాజీనామాతోనే ‘దళిత బంధు’వచ్చింది.
– ఈటల జమున 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement