గడ్కరీ ఇమేజ్‌ను బీజేపీ ఓర్వలేకపోయిందా?.. ప్రత్యర్థి ఫడ్నవిస్‌కు ఛాన్స్‌ అందుకేనా?

BJP Sided Nitin Gadkari From Top Body Replace Fadnavis - Sakshi

ముంబై: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. ఈ నిర్ణయం సొంత పార్టీ నేతలనే కాదు.. ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్న విపక్ష నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ పరిణామాన్ని ఆధారంగా చేసుకుని.. బీజేపీపై విమర్శలు సంధించింది ఎన్సీపీ. 

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంపై స్పందించింది. ప్రజల్లో గడ్కరీ ఇమేజ్‌ నానాటికీ పెరిగిపోతోందని, అది భరించలేకే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టిందని ఆరోపించింది. అంతేకాదు గడ్కరీని బీజేపీలో విచక్షణ, వివేకం ఉన్న నేతగా అభివర్ణించింది శరద్‌ పవార్‌ పార్టీ ఎన్సీపీ. 

మీ శక్తిసామర్థ్యాలు, వ్యక్తిగత ఇమేజ్‌ పెరిగినప్పుడు.. ఉన్నత స్థాయికి సవాలుగా మారినట్లే లెక్క. అప్పుడు BJP మీ స్థాయిని అమాంతం తగ్గిస్తుంది. కళంకం ఉన్నవాళ్లు ఆ స్థానంలో అప్‌గ్రేడ్ అవుతారు అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో.. గడ్కరీని పక్కనపెట్టడాన్ని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..

నితిన్‌ గడ్కరీకి మహా రాజకీయాల్లో సొంత పార్టీ నుంచే ప్రత్యర్థిగా భావించే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర ఎన్నికల కమిటీలో చేర్చింది బీజేపీ . గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను సైతం బీజేపీ తన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం గమనార్హం. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రాజకీయాలను వదిలేయాలని అనిపిస్తోందంటూ గడ్కరీ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలే చేశారు కూడా.

ఇదీ చదవండి: అనూహ్యం.. బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు ఇదే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top