Telangana: కమల ‘దళం’ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు వీరేనా? | BJP ready to announce candidates for Telangana Assembly Elections | Sakshi
Sakshi News home page

Telangana: కమల ‘దళం’ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు వీరేనా?

Aug 20 2023 1:00 AM | Updated on Aug 20 2023 8:04 AM

BJP ready to announce candidates for Telangana Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడటానికి ముందే మూడో వంతు మందికిపైగా అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యనేతలు, బలమైన ఒకే అభ్యర్థి ఉన్న 20 సీట్లతోపాటు ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులున్న మరో 20– 25 సీట్లకు టికెట్లు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభ ఉన్న నేపథ్యంలో.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు ముఖ్యనేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటివారి పేర్లు తొలి జాబితాలో ఉండనున్నట్టు తెలిసింది. తర్వాత దశలవారీగా మిగతా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం. 

సర్దుబాటు కోసం కొన్ని సీట్లు.. 
రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, మిగతా పార్టీలు కూడా అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు చేపట్టిన నేపథ్యంలో.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ముఖ్య నేతలు, గెలిచే, గణనీయంగా ప్రభావం చూపే వారు ఎవరెవరన్న విషయాన్ని  ఆరా తీస్తోంది.

అందులో గెలిచే అవకాశాలు ఉండీ టికెట్లు దక్కనివారిని బీజేపీలోకి చేర్చుకుని, బరిలోకి దింపే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో పలుచోట్ల సర్దుబాటుకు వీలుగా టికెట్లను పెండింగ్‌లో పెట్టాలని బీజేపీ నేతలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఎవరైనా కీలక నేతలు చేరితే.. వారి కోసం ముందుగా ఎంపిక చేసిన సీట్లలో అభ్యర్థులను మార్చి సర్దుబాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

ఓటింగ్‌ శాతం పెరుగుదలపై ధీమా 
బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక సీటు గెలుపొంది 7 శాతం ఓట్లను సాధించింది. అదే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓట్లశాతం ఏకంగా> 23.5 శాతానికి పెరగడంతోపాటు నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో ఊపు వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని, మూడోసారి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బీజేపీ ధీమాతో ఉంది.

ఈ లెక్కన రాష్ట్రంలోనూ ఓటింగ్‌ శాతం పెరుగుతుందని, గణనీయంగా ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని బీజేపీ జాతీయ, రాష్ట్ర ముఖ్యనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులందరినీ కూడా శాసన సభ ఎన్నికల బరిలో దింపుతున్నట్టు చెప్తున్నారు. 

 
బీజేపీ తరఫున అసెంబ్లీ బరిలో ఉండే అవకాశమున్న నేతలు వీరే 
► పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ తరఫున 20 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. మరో 25 వరకు నియోజకవర్గాల్లో ఇద్దరు, పలుచోట్ల ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. 
► వీరిలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న నేతలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. 

అమిత్‌షా పర్యటన తర్వాత.. 
ఈ నెల 27న బీజేపీ అగ్రనేత అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత 40–45 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల కసరత్తు ఊపందు­కోవడంలో భాగంగా.. సెప్టెంబర్‌ రెండో వారానికల్లా మరికొందరు అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నాయి.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి చేరికలను బట్టి సెప్టెంబర్‌ చివరికల్లా అందరు అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నాయి. పార్టీపరంగా, సంస్థాగతంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నందున (బలంగా ఉన్న సీట్లు మినహాయించి).. మిగతా 7 ఉమ్మడి జిల్లాలపై పార్టీనాయక­త్వం దృష్టి కేంద్రకరించిందని వెల్లడిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement