30 సభలు.. ముప్పేట దాడి  | BJP Top Leaders decided to hold public meetings in Telangana | Sakshi
Sakshi News home page

30 సభలు.. ముప్పేట దాడి 

Oct 8 2023 12:59 AM | Updated on Oct 8 2023 12:59 AM

BJP Top Leaders decided to hold public meetings in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. వరుసగా బహిరంగ సభలతో ప్రచార దండయాత్రకు సిద్ధమవుతోంది. ఈ నెల మొదట్లోనే రాష్ట్రంలో రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ నెలాఖరులో మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెలలోనే పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీలతోపాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులతో ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ప్రచారం ముగిసేదాకా కనీసం రోజుకొక అగ్రనేత సభ ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముగ్గురు అగ్రనేతలు పది ఉమ్మడి జిల్లాల పరిధిలో.. ఒక్కో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించే ఒక్కో సభలో పాల్గొననున్నారు. అంటే అగ్రనేతలతో 30 సభలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతల సభలు మరో 30 నిర్వహించాలని.. మొత్తంగా 60 సభలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. 

మోదీతో మరో 2, 3 సభలు! 
ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు సభల్లో పాల్గొనగా.. షెడ్యూల్‌ వెలువడ్డాక మరో రెండు, మూడు సభల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ పాలమూరు, నిజామాబాద్‌ సభలకు వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన భారీ మద్దతు పార్టీకి ఊపు తెచ్చిందని అంటున్నాయి. దీనికితోడు బీఆర్‌ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకునేందుకే నిరాకరించామని, ఇక మిత్రత్వానికి అవకాశమెక్కడ ఉందంటూ మోదీ కుండబద్దలు కొట్టడం కూడా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను, ఎన్నికల వాతావరణాన్ని మార్చేసిందని బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు.

తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత, రాజకీయ కార్యకలాపాల్లో కీలకపాత్ర నిర్వహించే బీఎల్‌ సంతోష్, తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, ప్రకాశ్‌ జవదేకర్‌ వంటి నేతలు పాల్గొన్న రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఎన్నికల కార్యాచరణ ప్రణాళికలు, వ్యూహాలు ఖరారయ్యాయని వివరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికే కార్యాచరణ మొదలుపెట్టాలని నిర్ణయించారని అంటున్నారు. 
 
అసంతృప్తి దారికి! 
ఇటీవలి మోదీ సభలు, అగ్ర నేతల బుజ్జగింపులతో పార్టీలోని అసంతృప్త నేతలు చాలా వరకు దారిలో పడినట్టేనని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. తాజాగా నడ్డాను కలసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు తమ మనసులోని సందేహాలు నివృత్తి చేసుకున్నారని, అభిప్రాయాలను వివరించారని సమాచారం. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మల్కాజిగిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసేందుకు విజయశాంతి ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
అగ్రనేతల సభలు ఇలా.. 
ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజేంద్రనగర్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 27న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో (శేరిలింగంపల్లిలో ఉండే అవకాశం) జరిగే సభకు హాజరవుతారు. ఇక ఈ నెల 10 నుంచి 27 తేదీల మధ్య ప్రధాని మోదీ ఉమ్మడి మెదక్‌ లేదా నల్లగొండ సభల్లో.. మరో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో జేపీ నడ్డా సభలు ఉంటాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 20, 21వ తేదీల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖమ్మం, నల్లగొండ జిల్లా పరిధిలో జరిగే సభల్లో పాల్గొంటారని వెల్లడించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల పరిధిలో ఏదో ఒకచోట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సభ ఉంటుందని వివరించాయి. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల్లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంతాల్లో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సభలు ఉంటాయని చెప్పాయి. నెలాఖరులోగా ఖమ్మం లేదా కొత్తగూడెంలో ప్రధాని మోదీ సభ ఉండొచ్చని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. చివరిగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు వెల్లడించాయి. 
 
21 మంది అభ్యర్థులతో తొలి జాబితా! 
బీజేపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తు వేగంగా సాగుతోంది. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, పార్టీ సీనియర్లు కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో 38 నియోజకవర్గాలకు అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల నుంచి ఆయా స్థానాలకు వారు సూచించే పేర్లతో జాబితాలు తీసుకున్నట్టు తెలిసింది.

సంఘ్‌ పరివార్, జిల్లా ఇన్‌చార్జులు, అధ్యక్షుల ద్వారా, ఇతర రూపాల్లో ఆయా స్థానాల కోసం అభ్యర్థుల పేర్లను సేకరించారు. గతంలో ఎంపీలుగా ఉన్నవారు, ఇతర నేతలు ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? చేస్తే ఏయే స్థానాలకు పరిగణనలోకి తీసుకుంటే మంచిదనే అంశంపైనా భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. మొత్తం 38 స్థానాలపై చర్చ జరిగినా.. 21 స్థానాల్లో అభ్యర్థులను ప్రాథమికంగా ఖరారు చేసినట్టు సమాచారం. పితృపక్షాలు, అమావాస్య ఉండటంతో.. అవి ముగిశాక ఈ నెల 14 తర్వాత తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

కేసీఆర్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా.. 
► ప్రజల్లో కేసీఆర్‌ సర్కారు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తమ క్షేత్రస్థాయి సర్వేల్లో తేలిందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో పకడ్బందీగా ప్రచార కార్యక్రమాలను రూపొందించి.. ఆ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మల్చుకోవడంపై ఫోకస్‌ చేసినట్టు వివరిస్తున్నాయి. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలను ప్రజల్లో ప్రచారం చేయాలని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని.. ఇదే సమయంలో మోదీ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణకు జరిగిన లబ్ధిని జిల్లా, మండల, గ్రామ స్ధాయిల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు నేతలు చెప్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement