
JP Nadda on Telangana BJP chief Sanjay Bandi’s arrest: ‘వినాశకాలే విపరీతబుద్ధి’అన్న చందంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మండిపడ్డారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందనడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు మరొక ఉదాహరణ అని విమర్శించారు. ఆదివారం రాత్రి సంజయ్ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి, లాఠీచార్జి చేయడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు.
ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా టీచర్లు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ సంజయ్ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ దీక్ష చేపట్టారన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని, అందుకే ఈ దీక్షపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించిందని ఆరోపించారు.
ఇటీవల హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం తర్వాత తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం కలవరపడుతోందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అణచివేత చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగించాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు. అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన తర్వాతే బీజేపీ విశ్రమిస్తుందని నడ్డా పేర్కొన్నారు.