ఎన్టీఆర్‌ శతజయంతి సభా ఫ్లాపే

Babu Dila due to lack of response to the struggle - Sakshi

రజనీకాంత్‌ను తీసుకొచ్చినా రాని జనం 

వచ్చిన కొద్దిమందీ చంద్రబాబు, బాలకృష్ణ ప్రసంగాలకు ముందే జంప్‌ 

చిన్న గ్రౌండ్‌లో పెట్టినా నిండని కుర్చిలు 

పోరంకి సభకు స్పందన లేకపోవడంతో బాబు డీలా 

సాక్షి, అమరావతి: చంద్రబాబు సభలకు జనం రావడంలేదని మరోసారి రుజువైంది. ఎన్టీఆర్‌ శతజయంతి పేరుతో కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం కూడా తుస్సుమంది. ఎన్టీఆర్‌ పేరు చెప్పి ఎంత హడావుడి చేసినా, చెన్నై నుంచి రజనీకాంత్‌ను తీసుకొచ్చి హంగామా చేసినా, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దింపినా జనం నుంచి మాత్రం స్పందన రాలేదు. సభలో సగం కుర్చీలు కూడా నిండలేదు. తాడిగడప–ఎనికేపాడు రోడ్డులోని చిన్న గ్రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఈ సభ నిర్వహించింది.

టీడీపీ నేతకు చెందిన రెండున్నర ఎకరాల ఖాళీస్థలంలో భారీ సెట్టింగులు, హోర్డింగులు, డీజే, హైమాస్ట్‌ లైటింగులతో హడావుడి చేసినా జనం మాత్రం పట్టించుకోలేదు. ఈ చిన్న గ్రౌండ్‌ను నాలుగు భాగాలుగా విభజించి ఒకదాన్లో వేదిక, సెట్టింగులు వేయగా రెండో భాగాన్ని వీఐపీలు, ముఖ్యులకి, మూడు, నాలుగు భాగాలను జనానికి కేటాయించి బారికేడ్లు పెట్టి కుర్చిలు వేశారు. వీఐపీ గ్యాలరీ, ఆ తర్వాత ముఖ్యులకు కేటాయించిన గ్యాలరీల్లో ఓ మాదిరిగా జనం కనిపించారు. ప్రజల కోసం కేటాయించిన గ్యాలరీ మాత్రం వెలవెలబోయింది. ఈ గ్యాలరీలో ఎటుచూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి.

భారీగా జనం వస్తారనే ఆశతో వాటర్‌ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినా అవి తీసుకునేవారే కరువయ్యారు. వచ్చిన కొద్దిపాటి జనంలో సగంమందికిపైగా చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ రాకముందే సభను వీడి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న వారిని ఆపడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. మిగిలినవారిలో చాలామంది బాలకష్ణ, రజనీకాంత్, చంద్రబాబు మాట్లాడే సమయానికి వెళ్లిపోయారు.

ముందుభాగంలో ఉన్న కొద్దిపాటి జనాన్నే టీడీపీ అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో భారీగా వచ్చినట్లు చిత్రీకరించినా వెనుకభాగంలో ఖాళీ కుర్చిలు చూసిన ఆ పార్టీ నేతలు జనం ఎందుకు రావడంలేదని మాట్లాడుకోవడం కనిపించింది. తమకు బాగా పట్టుందని చెప్పుకొనే కృష్ణాజిల్లాలో నడి»ొడ్డున, అదీ అతి చిన్న గ్రౌండ్‌లో పెట్టిన సభకు జనం రాకపోవడంతో చంద్రబాబు డీలాపడ్డారు. టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు సైతం ఎంత ప్రయత్నించినా, ప్రలోభాలు పెట్టినా జనం రావడంలేదని వాపోతున్నారు. 

జనం రావడం లేదనే చిన్న గ్రౌండ్‌.. అయినా ఫలితం నిల్‌  
తన సభలకు జనం రావడంలేదని తెలియడంతోనే భారీగా వచ్చినట్లు చూపించుకునేందుకు చంద్రబాబు చిన్న గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. రెండురోజుల కిందట పల్నాడు జిల్లా అమరావతి, సత్తెనపల్లి సభలను కూడా చిన్న గ్రౌండ్లలో పెట్టినా జనం రాలేదు. అంతకుముందు మచిలీపట్నం, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఆయన సభలను జనం పట్టించుకోలేదు. పల్నాడు జిల్లా నాయకులు ఎంత ప్రయత్నించినా, భారీగా తాయిలాలు పంచినా జనసమీకరణ చేయలేకపోయారు.

దీంతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ పెట్టి వారికి క్లాసు పీకారు. జనాన్ని ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించి చిందులు తొక్కారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తగిలిన షాక్‌తో కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో ఎన్టీఆర్‌ శతజయంతి సభకు భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. రజనీకాంత్‌ను తీసుకురావడం, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులందరినీ రంగంలోకి దింపడం ద్వారా హైప్‌ తీసుకురావడానికి ప్రయత్నించారు. అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇది కూడా ప్లాప్‌ అవడంతో టీడీపీ నేతలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top