తమిళ రాజకీయాల్లో కొత్త స్క్రిప్ట్‌.. అన్నామలైకి మైనస్సే! | Is Annamalai Really Need Rajinikanth for Political Party | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయాల్లో కొత్త స్క్రిప్ట్‌.. అన్నామలైకి మైనస్సే!

Jun 2 2026 10:46 AM | Updated on Jun 2 2026 12:26 PM

Is Annamalai Really Need Rajinikanth for Political Party

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ కలకలం నడుస్తోంది. బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. వరుస అవమానాల నేపథ్యంలో అనుచరుల నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయని.. అందుకే పార్టీకి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆ ప్రచార సారాంశం. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ వాతావరణం వేడెక్కించింది మాత్రం.. ఇందులోకి సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్ పేరు వచ్చి చేరడం.

మాజీ ఐపీఎస్‌ అయిన అన్నామలైకి తమిళనాట విపరీతమైన క్రేజ్‌ ఉంది. అలా ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. ఇక డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చీఫ్‌గా ఓ మినీ యుద్ధమే చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రతిపక్షం అన్నాడీఎంకే కంటే ఆయన బెటర్‌ అవుట్‌పుట్‌ కనబరిచారు. అయితే.. బీజేపీ ఆ ‍క్రేజ్‌ను సరిగ్గా వాడుకోలేదనే చర్చ నడుస్తుంటుంది అక్కడ.

ఎన్నికల ముందు పార్టీ చీఫ్‌ పదవి నుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా మొండి చేయి, ఎన్నికల ప్రచారంలోనూ ప్రాధాన్యత తగ్గించడం లాంటి పరిణామాలు ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనం పెంచింది. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు తగ్గిపోవడంతో కొత్త పార్టీ ప్రతిపాదన తెర మీదకు వచ్చిందని తెలుస్తోంది. ఈ పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో “అన్నామలై కొత్త పార్టీ పెడతారా?” అన్న చర్చ వేగంగా పెరిగింది. దీనికి కారణాలుగా నెటిజన్లు చూపుతున్న అంశాలు ఇవి:

  • యువ నాయకుడిగా ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్

  • సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

  • బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుల తర్వాత వచ్చిన అనిశ్చితి

  • సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన మాట్లాడే శైలి.. ఇవన్నీ కలిపి “తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి” అనే ఊహాగానాలకు బలం ఇచ్చాయి.

మరోవైపు.. అన్నామలైకి రాజ్యసభ సీటు దక్కకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీ రోల్‌ పోషించారనే ప్రచారం ఈ మధ్యే వినిపించింది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ భావించిందని.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారని.. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి లేదంటే తన పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తికే ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నారనన్నది ఆ ప్రచార సారాంశం. ఈలోపు..

మరో ప్రచారం తోడైంది. సీనియర్‌ నటుడు రజినీకాంత్‌  ఆశీర్వాదంతోనే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తులపై చర్చ వచ్చిన ప్రతిసారీ రజినీకాంత్ పేరు సహజంగానే తెరపైకి వస్తుంది. ఆయనకు ఉన్న విస్తృతమైన ఫ్యాన్ బేస్‌ అందుకు ప్రధాన కారణం. అలా అన్నామలై కొత్త పార్టీకి రజినీ సపోర్ట్‌ అంటూ  జోరుగా పోస్టర్లతో ప్రచారం నడుస్తోంది. రజినీకాంత్ కర్ణాటక మూలాలు కలిగి ఉండటం, అలాగే అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య “ కర్ణాటక కనెక్షన్” ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..

అన్నామలై చుట్టూ నడుస్తున్న చర్చకు ఒక సమాంతర వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయ ప్రయాణం స్వయంగా ఒక “అన్‌ఫినిష్డ్ చాప్టర్”గా మిగిలిపోయిందని.. కాబట్టి అనన్నామలైకు ఆ అవసరమే లేదన్నది ఆ వాదన. రజినీకాంత్ 2017–2021 మధ్య రాజకీయ ప్రవేశానికి గట్టి సంకేతాలు ఇచ్చినా, చివరికి పార్టీ ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆరోగ్యం, రాజకీయ ఒత్తిళ్లు, సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కొందరు విశ్లేషకులు—“పొలిటికల్ స్పేస్‌లో రజినీకాంత్ ఒక ‘మిస్డ్ ఛాన్స్’ మాత్రమే” అని వ్యాఖ్యానిస్తారు.

ఇక మరో అంశం సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తోంది. రజినీకాంత్ ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అధికార పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి స్పష్టమైన విమర్శలు చేయకపోవడం, ఆయనను “పాసివ్ స్టాండ్”లో ఉన్న నేతగా చూపిస్తోందని ఒక వాదన ఉంది. కొంతమంది అయితే ఆయన స్టాలిన్‌ను కలిసిన సందర్భాలను ప్రస్తావిస్తూ, ఆయన డీఎంకేకు సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో.. ఆయన విజయాన్ని రజినీకాంత్ బహిరంగంగా అభినందించలేదన్న అంశాన్ని కూడా కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “నాకేం అసూయ లేదు” అని ఇచ్చిన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. దీనిని ఆధారంగా చేసుకుని, రజినీ ఇప్పుడు “యాక్టివ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్” కలిగిన వ్యక్తి కాదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.

ఈ నేపథ్యంతోనే అన్నామలై వంటి యువ నాయకుడికి రజినీ మద్దతు అవసరం లేదని. కారణం, ఆయనకు ఇప్పటికే ఉన్నది ఒక వేరే పొలిటికల్ ఐడెంటిటీ. ఐపీఎస్ నేపథ్యం, బీజేపీలో ఎదిగిన సంస్థాగత అనుభవం, సోషల్ మీడియాలో ఉన్న యువ ఫాలోయింగ్.. ఇవే ఆయనకు ప్రధాన బలం అని ఈ వర్గం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement