న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్‌లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.
అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.
అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్‌గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
బీజేపీకి గుడ్‌బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది.


