కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ చక్రబేరియా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.
స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్‌లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.
అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్‌లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్‌కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్‌లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.
ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు.


