
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్ నివాసం వద్ద దాడి ఘటనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఎక్స్ వేదికగా పిలుపు ఇచ్చారు.
‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారాయన. అయితే.. అంతకు ముందు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 23, 2024
అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్‌ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమని, ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.