సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ నెలకొంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ఈ భేటీలో తన వద్ద 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. అయితే, ఆ సంఖ్యపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని సూచించారు.
సంఖ్యాబలం నిరూపించుకునేందుకు గవర్నర్ నేటి అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఫలితంగా, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న టీవీకే శ్రేణుల ఆశలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీకే–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, సంఖ్యాబలం సరిపోలేదు. దీంతో టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)తో భేటీ అయ్యి, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరిపారు. అయితే, ఈపీఎస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.
అన్నాడీఎంకేలో కొంతమంది (సుమారు 30కిపైగా) ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ఈపీఎస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. టీవీకేతో కలిస్తే పార్టీకి మళ్లీ శక్తి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడం, అంతర్గత చర్చలు కొనసాగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీవీకేకి సంఖ్యాబలం సరిపోలలేదు. నేటి అర్ధరాత్రితో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అదే సమయంలో తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో, టీవీకే అధినేత విజయ్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం తక్కువగా ఉండటం, గవర్నర్ సూచించిన మెజారిటీ నిరూపణ చేయాల్సిన అవసరం ఆసక్తికరంగా మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది.


