టీడీపీ నేతల తీరుపై కార్యకర్తల ఆగ్రహం

Activists Angry Over TDP Leaders Behavior In Chittoor District - Sakshi

నమ్మించి నట్టేట ముంచేశారని ఆవేదన

బాబు పర్యటనపై పెదవి విరుస్తున్న తమ్ముళ్లు 

కుప్పం ఫలితాలు చంద్రబాబును నియోజకవర్గానికి పరుగులు పెట్టించాయి. అధినేత పర్యటనపై టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శిస్తున్నాయి. మేము రాలేం బాబోయ్‌ అని తేల్చిచెబుతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోయాక సమీక్ష సమావేశాలతో ప్రయోజనం లేదని వెల్లడిస్తున్నాయి. బాబు తీరుతో విసిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  పంచాయతీ ఎన్నికల పరాభవానికి ముఖ్య నాయకుల తీరే కారణమని విశ్లేషిస్తున్నాయి. నమ్మించి నట్టేట ముంచేశారని మండిపడుతున్నాయి.

సాక్షి, తిరుపతి: కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజలు పర్యటనకు రానున్నారు. ఓటమిపై సమీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక నాయకులు  పీఏ మనోహర్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నంపై  ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులు, కార్యకర్తలు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఘోర ఓటమికి మీ ముగ్గురి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర ఆర్థిక వనరులు లేవని, సర్పంచ్‌ బరిలో నిలబడలేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పోటీకి దించారని వాపోయారు. దీంతో అప్పులపాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రచారానికి కూడా రాలేదని నిరసన తెలిపారు. ఈ  పరిస్థితుల్లో పార్టీ కోసం తామెందుకు కష్టపడాలని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి, కోట్లరూపాయలు సంపాదించిన నాయకులు, ఇప్పుడు కాడి పారేశారని మండిపడ్డారు.

మా గోడు వినరు! 
చంద్రబాబు పర్యటనకు తాము హాజరు కాలేమని కార్యకర్తలు తేలి్చచెబుతున్నారు. ఒకవేళ సమావేశానికి వచ్చినా బాబు చెప్పిన మాటలు విని రావటం తప్పితే, తమ గోడు వినే పరిస్థితి ఉండదని వెల్లడిస్తున్నారు.  నాయకత్వం మారితేనే కుప్పంలో పార్టీ స్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. 

నేడు కుప్పానికి బాబు 
కుప్పం:   నియోజకవర్గంలో మూడు రోజు పర్యటన నిమిత్తం గురువారం కుప్పం రానున్నట్లు టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.గురువారం ఉదయం గుడుపల్లె మండలం రాళ్ల గంగమ్మ ఆలయంలో నిర్వహించే  కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రామకుప్పంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం శాంతిపురంలోని  ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. శనివారం ఉదయం కుప్పం మున్సిపాలిటీ  పరిధిలోని కార్యాకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు.  

రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు. ఆర్థిక సాయం చేస్తామని పోరుపెట్టి పోటీకి నిలబెట్టారు. తీరా నమ్మి నామినేషన్‌ వేస్తే తిరిగి చూడలేదు. పొలం తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఖర్చుపెట్టా. చివరకు ఓడిపోయి అప్పుల పాలయ్యా. అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు.
కుప్పం నియోజకవర్గంలో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి ఆక్రోశం 

మా నాయన జమీందారులాంటివాడు. రాజకీయాల్లోకి రాక ముందే మాకు చాలా ఆస్తులున్నాయి. పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత చాలా పోగొట్టుకున్నా. పెట్రోలు బంకుల వంటి ఆదాయ వనరులను కోల్పోయా. చివరకు అప్పులే మిగిలాయి. ఇకపై నాకు ఇన్‌చార్జి పదవి అక్కర్లేదు. రాజీనామా చేసేస్తా.
– కుప్పం టీడీపీ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నం ఆవేదన
చదవండి:
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం  
టీడీపీ సినిమా ముగిసింది

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top