మోదీ అడ్డాలో విజయం మాదే.. దిక్కుతోచని స్థితిలో బీజేపీ

AAP Will Win Gujarat Election Claims Arvind Kejriwal - Sakshi

అహ్మదాబాద్‌: ఈ ఏడాది చివర్లో జరగనున్నగుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో తామే అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఐబీ నివేదికలో తేలిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని తనకు ఐబీ వర్గాల్లో తెలిసిన వారు చెప్పారని వెల్లడించారు. అయితే కొద్ది తేడాతోనే ఆప్ గెలుస్తుందని, నివేదిక చెబుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున గుజరాత్ ప్రజలు ఆప్ మెజార్టీని మరింత పెంచాలని కోరారు.

ఆప్ విజయం సాధిస్తుందని తెలిసి బీజేపీ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఎలాగైనా తమను ఓడించాలని కమలం పార్టీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రెండు పార్టీలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ఆప్‌ గెలవకుండా కాంగ్రెస్‌ను గెలిపించేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. 

గుజరాత్‌లో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నవారు ఆప్‌కే ఓటు వేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఆ పార్టీ పని అయిపోయిందని, 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌ కంటే గుజరాత్‌లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉ‍న్న ఆయన మాట్లాడిన వీడియోను ఆప్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

గోవుకు రూ.40
గుజరాత్‌లో ఆప్‌ను గెలిపిస్తే గోవులు ఉన్నవారికి ఒక్కో ఆవుకు నెలకు రూ.40 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోనూ ప్రస్తుతం ఈ పథకం అమలు అవుతోందని చెప్పారు. దేశ రాజధానిలో ఆవులున్న వారికి ఒక్కో ఆవుకు రూ.40చొప్పున ప్రతినెల చెల్లిస్తున్నామని వివరించారు. రూ.20 ఢిల్లీ ప్రభుత్వం నుంచి మరో రూ.20 మున్సిపల్ కార్పోరేషన్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. అలాగే గోవుల కోసం ప్రతి జిల్లాలో షెల్టర్ హోమ్స్ నిర్మిస్తామన్నారు. ఢిల్లీలో బీజేపీకి బలంగా హిందూ ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు కేజ్రీవాల్ ఈ హామీని ప్రకటించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్.. ఎలాగైనా గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ తరచూ గుజరాత్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం  కురిపిస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగత భృతి, ఉచిత కరెంట్, విద్యారంగంలో సంస్కరణలు వంటి హామీలను ఇప్పటికే ప్రకటించారు.
చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top