AAP Arvind Kejriwal Targets Congress Instead Of BJP In Gujarat - Sakshi
Sakshi News home page

AAP Arvind Kejriwal: బీజేపీని వదిలి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన ఆప్‌!

Jul 5 2022 4:09 PM | Updated on Jul 5 2022 5:35 PM

AAP Arvind Kejriwal Targets Congress instead of BJP in Gujarat - Sakshi

కాంగ్రెస్ పార్టీ కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శలకు ఎక్కుపెట్టారు అరవింద్ కేజ్రీవాల్‌. ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు పడకుండా చూడాలని ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గుజరాత్‌లో గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలని సూచించారు.

ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని వ్యూహ రచన చేస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఆప్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శలకు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు పడకుండా చూడాలని ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గుజరాత్‌లో గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలని సూచించారు.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది ఆప్. అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెసే తమ ప్రధాన ప్రత్యర్థి అని గుర్తించి.. ఎలాగైనా ప్రతిపక్షహోదాను దక్కించుకోవాలని చూస్తోంది. గుజరాత్‌లో 27ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో కల్పించాలనుకుంటోంది.

ఆప్‍ను ఎదగనివ్వకుండా బీజేపీ వ్యూహం 
ఇదిలా ఉంటే ఆప్‌ను గుజరాత్‍లో బలపడనివ్వకూడదని భాజపా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. ప్రతిపక్షం కాంగ్రెస్‌పైనే విమర్శలు గుప్పిస్తూ.. ఆప్‌ అసలు పోటీలోనే లేదనేలా ప్రచారం చేయాలనుకుంటోంది. అందుకే ప్రధానంగా హస్తం పార్టీనే లక్ష‍్యంగా చేసుకుంటూ విమర్శలకు ఎక్కుపెడుతోంది. దేశంలోని పలు చోట్ల భాజపాకే ఎసరుపెడుతూ ఆప్‌ సత్తా చాటుతోంది. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనూహ్య విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అందుకే ఆప్‌ను ఎదగనివ్వకుండా కమలం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది.

ఆప్‌ ఆఫీస్ బేరర్ల సమావేశాలు అహ్మదాబాద్‌లో ఆదివారం, సోమవారం జరిగాయి. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే 7000 మంది నూతన ఆఫీస్ బేరర్లుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్‍కు ఓటు వేసినా వృథా అని ప్రచారం చేయాలని వీరికి కేజ్రీవాల్‌ సూచించారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటు వేసిన ప్రజలు.. ఇప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలు  ఆ పార్టీని వీడుతున్నారో చూడాలన్నారు. ఉచిత కరెంట్, ఉచిత విద్య వంటి పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్న ఆప్ దిల్లీ, పంజాబ్ మోడల్‌ గురించి గుజరాత్ ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కేజ్రీవాల్‌ కోరారు.

కాంగ్రెస్‌ను వీడుతున్న నేతలు
2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గానూ 77 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్‌. 25 ఏళ్లలోనే అత్యధిక సీట్లు సాధించింది. అయితే ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌ను చాలా మంది ఎమ్మెల్యేలు వీడారు. దాదాపు అందరూ బీజేపీలోనే చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 64కు పడిపోయింది. కాంగ్రెస్‌ను వీడిన ప్రముఖ నాయకుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హార్దిక్ పటేల్ ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, పాటీదార్‌ నాయకుడు నరేష్ పటేల్ హస్తం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ.. రాజకీయాల్లోకి రావట్లేదని ఆయన ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆప్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement