పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 13 నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు ఉద్యోగులు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశారు. డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌లు, ఏఎన్‌ఎంలు తదితర విభాగాల సిబ్బంది విధులు బహిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం 447 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
న్యాయం చేయాలని వినతి
పెద్దపల్లిరూరల్: ‘మా దత్తత తల్లి గొర్రె శోభ ఆరేళ్లక్రితం మరణించింది. ఆమెకు వారసుడిగా ఉన్న. బెనిఫిట్స్ నాకు అందకుండా కార్యాలయ సూపరింటెండెంట్ సర్వీస్‌బుక్ ఇవ్వడం లేదు. డబ్బులిస్తేనే ఇస్తానని వేధిస్తున్నాడు. దీంతో కొంతమొత్తాన్ని ముట్టజెప్పా.. అయినా ఇవ్వడం లేద’ని బాధితుడు కరుణాకర్ వాపోయాడు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో గంగయ్యకు తన సమస్యను విన్నవించాడు. తన తల్లి సర్వీస్‌బుక్ ఎక్కడుందో చెప్పాలని కోరినా స్పందించక పోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించానని బాధితుడు వివరించాడు. హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుని సర్వీసు బుక్ ఇప్పించి తనకు దక్కాల్సిన బెనిఫిట్స్ ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
ప్రశాంతంగా సప్లిమెంటరీ
పెద్దపల్లి: జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి శారద తెలిపారు. జిల్లాలోని రెండు కేంద్రాల్లో పదో తరగతిలో 45 మందికి 37 మంది(82 శాతం), ఇంటర్మీడియట్‌లో 57 మందికి 43 మంది(75 శాతం) హాజరయ్యారని డీఈవో పేర్కొన్నారు.
22న గోదావరిఖనిలో ఎస్సై, కానిస్టేబుల్ ‘ప్రిలిమ్స్’
పెద్దపల్లి: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఈనెల 22న గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా రూ.10,000, ద్వితీయ బహుమతిగా రూ.5,000, తృతీయ బహుమతిగా రూ.2,000 నగదు ప్రోత్సాహకంగా అందిస్తారు. అంతేకాదు.. అత్యంత ప్రతిభ కనబరిచిన తొలి 100 మంది అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్‌తోపాటు భోజనం, వసతి కల్పించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 77805 43055, 88863 04040 నంబర్లలో సంప్రదించాలి.


