పెద్దపల్లి: డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు, ప్రసవాలు, ఎన్‌సీడీ సర్వే, టీబీ, హెచ్‌ఐవీ అవగాహన అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, దోమలవృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షా కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వై.పవిత్ర, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్లు సుధాకర్, సంజనేష్, లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు.
మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయాలి
మహిళలను ఆర్థికంగా, పారిశ్రామికంగా శక్తివంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా సాధికారత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. మహిళలకు అందిస్తున్న సేవలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక సాధికారత తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆర్థిక సంబంధిత అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కీలక పాత్ర పోషించాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి పవిత్ర, జిల్లా ఉపాధి అధికారి, ఇంటర్మీడియట్ అధికారి కల్పన, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ వెంకటేష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, వీ హబ్ సమన్వయకర్త, టాస్క్ సమన్వయకర్త కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.
ఈనెలలోగా పంటల సర్వే పూర్తి చేయాలి
డిజిటల్ పంటల సర్వేను ఈనెల 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేఽశించారు. గురువారం మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి మండలాల సర్వే అధికారులతో సర్వే పురోగతిపై సమీక్షించారు. ప్రతీ రైతు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


