రామగిరి: గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3) సవరణకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 263 గ్రామ పంచాయతీలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వసూలు చేసే సొంత ఆదాయం ట్రెజరీ ద్వారా వినియోగానికి వెళ్లాల్సి వస్తుండగా, కొత్త సవరణతో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఆదాయం నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమకానుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలోనే జారీచేసే అవకాశం ఉంది.
ఆస్తిపన్నులు..
ఆస్తిపన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, భవన నిర్మాణం అనుమతుల రుసుం, మార్కెట్ ఫీజు, ఇతర ఆదాయ వనరుల ద్వారా వచ్చే నిధులను గ్రామ పంచాయతీ నేరుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. తద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాల మరమ్మతు, సదుపాయాల కల్పన, అత్యవసరాలకు ఆలస్యం లేకుండా నిధులు వెచ్చించవచ్చు. చిన్న అభివృద్ధి పనులకే నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే స్థానికంగా సమకూరే ఆదాయాన్ని గ్రామావసరాలకు వెంటనే వినియోగించుకునే వీలు కలుగనుంది. తద్వారా గ్రామాభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో కూడా జవాబుదారీతనం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.


