నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత | - | Sakshi
Sakshi News home page

నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత ● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయం

● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్‌ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్‌ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు.

ఘటన నేపథ్యం

మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్‌ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్‌ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్‌ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్‌ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement