తండ్రి మృతి.. కూతుళ్లు అనాథలు | - | Sakshi
Sakshi News home page

తండ్రి మృతి.. కూతుళ్లు అనాథలు

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): రెండేళ్ల క్రితం తల్లి.. నేడు తండ్రి మృతిచెందడంతో ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పోతుగల్‌కు చెందిన జిల్లెల వెంకటేశ్‌(45) రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. భార్య వినోద రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందింది. ముగ్గురు పిల్లలను అన్నీ తానై పోషించిన వెంకటేశ్‌ మూత్రపిండాల వ్యాధికి గురికావడంతో రూ.8లక్షల వరకు అప్పుచేసి చికిత్స అందించారు. అయినా వ్యాధి నయంకాక ఆదివారం రాత్రి మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి రూ.25 వేల నగదును పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు క్రాంతి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు. ఉపసర్పంచ్‌ కోల కృష్ణ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణకట్టలో అదనపు వసూళ్లపై ఫిర్యాదు

వేములవాడ: రాజన్న ఆలయ కల్యాణకట్టలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ వరంగల్‌కు చెందిన భక్తురాలు హసీనా ఆలయ ఈవో రమాదేవికి సోమవారం ఫిర్యాదు చేశారు. యాకూబ్‌భాష, హసీనా కుటుంబ సభ్యులతో కలిసి తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్టకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వెంకటేశ్‌ అనే నాయీబ్రాహ్మణుడు అధికారిక రుసుంపై అదనంగా రూ.50 ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. నగదు లేదని చెప్పడంతో రూ.50 ఫోన్‌పే చేయాలని బలవంతం చేయడంతో పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

పెద్దపల్లి: కమాన్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ను సస్పెన్షన్‌ చేస్తూ ఇంటర్మీడియట్‌ డైరెక్టర్‌ అభిలాష అభినవ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేశారు. ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించే సమయంలో అనుచిత ప్రవర్తన, కార్యాలయ క్రమశిక్షణ పాటించకపోవడం తదితర ఆరోపణలు రావడంతో క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేయడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement