● 30 మంది రైతులు.. 3 గంటలపాటు ఆందోళన ● పది రోజుల్లో న్యాయం చేస్తామన్న అధికారులు
వేములవాడరూరల్: ధాన్యం డబ్బులు రావడం లేదని.. న్యాయం చేయండి అంటూ రైతులు నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి సోమవారం నిరసన తెలిపారు. మూడు గంటలపాటు ఆందోళన చేపట్టగా అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో శాంతించారు. రైతులు, అధికారులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం గ్రామాలకు చెందిన దాదాపు 46 మంది రైతులు వేములవాడ సొసైటీకి 7 లారీల ధాన్యం విక్రయించారు. ఈ ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.52 లక్షలు రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా జిల్లా కేంద్రంలోని ఓ గోదాంకు వెళ్లింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మధుకర్ ఆ ధాన్యాన్ని పక్కదోవ పట్టించాడు. ఈ విషయంలో సదరు వ్యక్తిపై కేసు నమోదుకావడంతోపాటు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలోనే రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమకావడం లేదు. మధుకర్ వేములవాడలో నిర్మిస్తున్న ఇంటిపైకి ఎక్కిన రైతులు దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, డీసీవో బుచ్చిబాబు, తహసీల్దార్‌లు జయంత్, అబుబాకర్‌లు అక్కడికి వెళ్లి 10 రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మల్లారం మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, మల్లారం ఉపసర్పంచ్ కొంపెల్లి శ్రీకాంత్, నూకలమర్రి ఉపసర్పంచ్ శంకరయ్యగౌడ్ ఉన్నారు.


