● ముందుకొచ్చిన జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం
తిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్‌లోని జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య పదిహేను రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్‌రావు స్పందించారు. వికాస్‌కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్‌గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్‌రావు, సుమిత్‌సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.


