గోదావరిఖని: సింగరేణి గనుల్లోని పనిస్థలాల్లోకి మొబైల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని యాజమాన్యం నిషేధించింది. పనులు పక్కనపెట్టి వీడియోలు తీస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడతోపాటు సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం జారీచేసిన ఆదేశాలు కార్మికులు, ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. డీడీఎంఎస్ నిబందనల ప్రకారం భూగర్భ గనులు, ఓసీపీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లు వినియోగించరాదు. రాజకీయ నాయకులు భూగర్భ గనుల సందర్శనకు వెళ్లినప్పుడు ఇష్టానుసారంగా వీడియోలు, ఫొటోలు తీయడం, వారితో కార్మికులు, ఉద్యోగులు సెల్ఫీలు దిగడం చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధమని యాజమాన్యం చెబుతోంది.
ఓసీపీల్లో కూడా నోఎంట్రీ
ఓసీపీ(ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు) క్వారీల్లోనూ సెల్‌ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించారు. సెల్‌ఫోన్‌లు వి నియోగిస్తూ భారీయంత్రాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావి స్తున్నారు. ఉత్పాదకత దెబ్బతినడంతోపాటు డీడీఎంఎస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని యాజమాన్యం గుర్తించింది.
ఏరియా జీఎంలకు బాధ్యతలు
అన్ని బొగ్గు గనుల్లో సెల్‌ఫోన్‌ల వినియోగాన్ని కట్టడిచేసేందుకు ఏరియాల జీఎంలు బాధ్యత తీసుకోవాలని యాజమాన్యం సూచింది. భూగర్భ గనులు, డిపార్ట్‌మెంట్‌లు, ఓసీపీల్లో మొబైల్‌ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించాలని ఆదేశాలు రావడంతో ఆయా ఏరియాల అధికారులు అప్రమత్తమయ్యారు.
మ్యాన్‌రైడింగ్ రీల్సే కారణమా?
సింగరేణి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌లు వెంట తీసుకెళ్లి మ్యాన్‌రైడింగ్ నుంచి పనిస్థలాల వరకు వీడియోలు తీస్తూ రీల్స్ చేస్తున్న దృశ్యాలు సీఎండీ కార్యాలయానికి వెళ్లాయి. తద్వారా పనిస్థలాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఉత్పాదక సమయాన్ని కోల్పో యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతీఒక్కరు తమ సెల్‌ఫోన్‌లు డిపాజిట్ చేసిన తర్వాతే భూగర్భ గనిలోకి వెళ్లాలని ఉత్తర్వులు జారీచేశారు.
సెల్‌ఫోన్‌తో బొగ్గు గనుల్లోకి నో ఎంట్రీ
క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్న యాజమాన్యం


