● 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం
● మూడు బైకులు, ఆటో, రెండు సెల్‌ఫోన్స్..
● సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి
సిరిసిల్ల: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే దొంగలముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ కె.నాగేంద్రాచారి శనివారం వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన ఆడెపు రవి(25) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పట్టణంలో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు. రవితో కలిసి అతని స్నేహితులు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సామల్ల బాలకిషన్(23), వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణాకు చెందిన బోదాసు గోపి(19), సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన వేముల సాయిచరణ్‌రెడ్డి(19), కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన గాజులవేణి అరుణ్‌కుమార్(23), ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్‌కు చెందిన మూల అభిలాశ్(19)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఆడెపు రవి గతంలో 18 దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. దొంగసొత్తును అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. జిల్లా కేంద్రంలో నెల రోజుల వ్యవధిలో ఐదు ఇండ్లల్లో దొంగతనాలు చేశారు. పెద్ద ఎత్తున దొంగతనం చేయాలని ఆరుగురు వస్తుండగా ఎల్లమ్మ సర్కిల్ వద్ద పట్టుకున్నారు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలలో కొన్నింటిని ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కస్తూరి సాయితేజకు, వేములవాడలోని శీలం సంతోష్‌రెడ్డికి విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల నుంచి 17.5 గ్రాముల బంగారు, 14.5 తులాల వెండి ఆభరణాలు, రూ.1500 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, ఒక్క ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితులకు సహకరించిన సాయితేజ, సంతోష్‌రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, హెడ్‌కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, మారుతి, రవి, నాంపెల్లి శ్రీనివాస్, నాగరాజులను అభినందించారు.


