బతుకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

బతుకు పోరాటం

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

అడ్మిషన్లు తెస్తేనే

ప్రైవేటు టీచర్లకు వేతనాలు

ఉదయం 7 గంటలకే విద్యార్థుల కోసం వీధి పోరాటం

కుక్కల అరుపులు, ఛీత్కారాలతో నిత్యం అవమానాలు

మండుటెండల్లో ఇంటింటికీ తిరుగుతున్న ప్రైవేట్‌ స్కూళ్ల సిబ్బంది

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్‌ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్‌ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు.

సెలవులు లేని కొలువు

పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్‌ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు.

మెడపై అడ్మిషన్ల కత్తి

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.

ఉద్యోగులతో వెట్టిచాకిరీ...

అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వివరాలు

జిల్లా ప్రైవేటు

పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్‌ 298 6,254

రాజన్న సిరిసిల్ల 132 1,555

పెద్దపల్లి 192 4,224

జగిత్యాల 292 3,480

Advertisement
 
Advertisement
Advertisement