● కవలల హత్యతో జూబ్లీనగర్‌లో విషాదం
● నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన
● పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రి వద్ద పడిగాపులు
● పోలీస్ బందోబస్తు మధ్య రాత్రి 9గంటలకు అంత్యక్రియలు
కరీంనగర్‌రూరల్: కన్నతండ్రి కాలయముడుగా మారి కవల ఆడబిడ్డలను బావిలో పడేసి చంపిన సంఘటన పలువురిని కలచివేసింది. చిన్నారుల మృతితో జూబ్లీనగర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువుల్లో తీరని ఆగ్రహాన్ని రగిలించింది. శనివారం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిందితులను కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలంటూ చిన్నారుల తల్లితోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోస్ట్‌మార్టం ఆలస్యమైంది. రాత్రి 8.30గంటలకు చిన్నారుల మృతదేహాలను అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు.
పిల్లలను చంపి బావిలో పడ్డారంటూ డ్రామా
కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం ఐదేళ్లక్రితం మానకొండూరు మండలం లక్ష్మిపూర్‌కు చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. 2021లో కవల ఆడపిల్లలు గీతాన్‌శ్రీ, గీతాన్వికలు జన్మించగా అప్పటి నుంచి శ్రీశైలం మౌనికను ఆడపిల్లలను ఎందుకు కన్నావంటూ వేధింపులకు గురిచేశాడు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లాడు. పిల్లలను చంపి వ్యవసాయబావిలో పడేసిన, తనపై అనుమానం రాకుండా కాపాడుతున్నట్లుగా బావిలో దూకాడు. ఒక పాప మృతదేహాన్ని బావిలోని దరికి చేర్చి అరుస్తుండగా మౌనిక అక్కడికి రావడంతో సమీపంలో ఉన్న వాళ్లందరూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి గజ ఈతగాళ్ల సాయంతో మరో పాప మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల శ్రీశైలంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో బంధువుల ఆందోళన
శ్రీశైలంను శిక్షించాలంటూ శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో మౌనికతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోస్ట్‌మార్టం నిర్వహించేది లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పలు దఫాలుగా సాగిన చర్చల అనంతరం చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్‌రెడ్డి నచ్చచెప్పడంతో రాత్రి 8.30గంటలకు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి అంబులెన్స్‌లో జూబ్లీనగర్‌కు తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. మహిళలందరూ కంటతడిపెట్టారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐలు నిరంజన్‌రెడ్డి, కోటేశ్వర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుమ రాత్రి 9గంటలకు అంత్యక్రియలను పూర్తి చేశారు.


