నిర్లక్ష్యం.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం.. గందరగోళం

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

● జీజీహెచ్‌ – సిమ్స్‌ పాలనలో లోపాలు ● అధికారులు, ఉద్యోగుల్లో కొరవడిన సమన్వయం ● మెడికల్‌ కాలేజీలో దేహదాత కుటుంబాలకు అవస్థలు ● నేడు కలెక్టరేట్‌లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి సమావేశం

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)తోపాటు సింగరేణి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(సిమ్స్‌)లో పా లన లోపాలు ముదురుతున్నాయి. బాధ్యతా రాహిత్యం, సమన్వయాలోపం పేషెంట్లకు నరకం చూ పుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

లోపించిన జవాబుదారీతనం

మెడికల్‌ సూపరింటెండెంట్‌ విభాగం జవాబుదారీతనం కోల్పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. సూపరింటెండెంట్‌ సంతకాలు, చాంబర్‌కే పరిమితమవుతున్నారని, నిర్వహణ బాధ్యతలు ఆర్‌ఎంవోలపై పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు వైద్యులు, సిబ్బంది వారంలో రెండు, మూడుసార్లే విధులకు హాజరువుతున్నారని స మాచారం. హైదరాబాద్‌ నుంచి వచ్చిపోయే వైద్యాధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇది ఆస్పత్రిలోని పలువురు వైద్యుల మధ్య మనస్పర్థలకు దారితీస్తోంది.

మందులు, స్కానింగ్‌కు ప్రైవేటుకే..

పేషెంట్లకు మందులు లేవని చెబుతూ బయట కొ నుగోలు చేయాలని సూచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్‌ పరీక్షలు ఆస్పత్రిలో అందుబా టులో ఉన్నా.. తాము సూచించిన ప్రైవేట్‌ సెంట ర్లకు రెఫర్‌ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

దేహదాత కుటుంబాలకు అవస్థలు

మెడికల్‌ కాలేజీకి పార్థివదేహాలు దానం చేసేందుకు వస్తున్న అనేక కుటుంబాలకు అనవసరమైన నిబంధనలు విధిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం గౌరవవందనం చేపట్టకుండా, మార్చురీలో రోజుల తరబడి నిల్వచేస్తూ అవమానిస్తున్నారని అంటున్నారు. అనాటమీ, ఆస్పత్రి అధికారుల మధ్య సమన్వయ లోపం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

రక్తదాతలకు అందని అభినందన పత్రాలు?

బ్లడ్‌బ్యాంకులో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి అభినందన పత్రాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్టిఫికెట్లపై ఆలస్యంగా సంతకాలు చేయడంతో దాతలు మరోసారి ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. కొందరు అధికారులు దాతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సీసీ కెమెరాలు నిర్వీర్యం

ఆస్పత్రి భద్రతలో అ త్యంత కీలకమైన సీసీ కె మెరాల నిర్వహణలో తీ వ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. పలు విభాగాల్లో కెమెరాలు పనిచేయక ఆందోళన కలిగిస్తోంది.

గాడి తప్పిన శానిటేషన్‌

ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. మరోవైపు.. సిబ్బంది పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సేవలు మెరుగుపడేనా?

జీజీహెచ్‌లో వైద్యసేవలపై దృష్టి సారించడంతోపాటు పలు స మస్యలు పరిష్కారం, అభివృద్ధి తదితర అంశాలపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం కానుంది. బోధనాస్పత్రి, మెడికల్‌ కాలేజీ అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తారని తెలిసింది. ముఖ్యంగా వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, సమస్యల పరిష్కారం, బిల్లుల చెల్లింపులు వంటి కీలక అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. ఆస్పత్రి నిర్వహణలోని లోపాలను గుర్తించి, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టే దిశగా అధికారులకు సూ చనలు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement